పాత కక్షలే కారణం..

26 Aug, 2019 10:03 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు

ఆటో డ్రైవర్‌ హత్యలో వీడిన మిస్టరీ

ముగ్గురు నిందితుల అరెస్ట్‌  

హత్య చేస్తున్నట్లు భార్యకు చెప్పి వెళ్లిన నిందితుడు శ్రీకాంత్‌యాదవ్‌  

మియాపూర్‌ : మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఆటో డ్రైవర్‌ హత్యకు పాత కక్షలే కారణంగా పోలీసులు గుర్తించారు. ఆదివారం మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా, చర్లపల్లి గ్రామానికి చెందిన డొక్క శ్రీకాంత్‌యాదవ్‌ (30), నాగయలంక మండలం ఏసుపురం గ్రామానికి చెందిన స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వారికి ఒక కుమారుడు. పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి  ఎంఏనగర్‌లో ఉంటూ ఆటోలు అద్దెకు ఇవ్వడం, ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సమయానికి డబ్బులు తిరిగి ఇవ్వని ఆటో డ్రైవర్లను బెదిరించేవాడు. దీనికితోడు అమీన్‌పూర్‌కు చెందిన యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా 2017లో అమీన్‌పూర్‌కు చెందిన ఐలయ్య అనే రియల్టర్‌తో శ్రీకాంత్‌ భూమి విషయంలో గొడవ జరిగింది. ఐలయ్యపై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీకాంత్‌ అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడరు. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్‌ గడ్డం ప్రవీణ్‌తో శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది.

దీంతో   డబ్బులు ఇచ్చిపుచ్చుకునేవారు. అయితే డబ్బుల విషయమై గత కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నాలుగు నెలల క్రితం ఆటో అడ్డా వద్ద  వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ప్రవీణ్, ఐలయ్యతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో వారిద్దరూ కలిసి తనను హత్య చేస్తారని శ్రీకాంత్‌ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ప్రవీణ్‌ను హత్య చేసేందుకు తన మేనత్త కుమారుడైన కుక్కల నాగశ్రీనుతో కలిసి పథకం పన్నారు.  ఈ నెల 22న రాత్రి శ్రీవాణినగర్‌లో ప్రవీణ్‌ అతని స్నేహితుల పుట్టినరోజు పార్టీకి వెళ్తుండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీకాంత్, శ్రీను తాము అంతకంటే మంచి పార్టీ ఇస్తామని అతడిని తమ వెంట తీసుకెళ్లారు. అక్కడి నుంచి శ్రీకాంత్‌కు డబ్బులు ఇవ్వాల్సిన  రాజేష్‌ వద్దకు వెళ్లి అతడితో సహా ఆటోలో శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీకాంత్‌ భార్య స్వాతితో ప్రవీణ్‌ను చంపుతున్నామని, లేకపోతే అతను తనను చంపేస్తాడని ఇందుకు సహకరించాలని కోరాడు. ఆమె చున్నీ తీసుకొని రాజేష్‌ ఆటోలోనే దీప్తీశ్రీనగర్‌ వద్ద ఉన్న డంప్‌ యార్డు సమీపంలోని పొదల్లోకి వెళ్లారు.

పథకం ప్రకారం శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రవీణ్‌ మోహానికి చున్నీతో బిగించి పట్టుకున్నారు. రాజేష్‌ను కాళ్లు పట్టుకొమ్మని చెప్పగా, అతను భయంతో  అక్కడి నుంచి పారిపోయాడు. శ్రీకాంత్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రవీణ్‌ గొంతు కోసి తలను వేరు చేశాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆటోలో తలను తీసుకొని   మియాపూర్‌ క్రాస్‌ రోడ్డులోని రోహిత వైన్స్‌ ఎదుట పారవేశారు. అనంతరం భార్యపిల్లలు తీసుకొని పరారయ్యాడు. వారి నుంచి తప్పించుకున్న రాజేష్‌ నేరుగా  పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బొల్లారం క్రాస్‌ రోడ్డు వద్ద మృతుడు ప్రవీణ్‌ తలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24న మధ్యాహ్నం బీహెచ్‌ఇఎల్‌ వద్ద శ్రీకాంత్, శ్రీనివాస్, స్వాతిలను అదుపులోకి విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి కత్తి, సెల్‌ఫోన్, ఆటో, బుల్లెట్‌ బైక్, చున్నీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా