సినీఫక్కీలో మహిళా ఆటోడ్రైవర్‌కు టోకరా

6 Jun, 2019 10:19 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మొదటి మహిళా ఆటోడ్రైవర్‌గా గుర్తింపు పొందిన సునీతా చౌదరి ఆటోవాలాల చేతిలో మోసానికి గురయ్యారు. కొత్త ఆటో కోసం జమచేసుకున్న సొమ్మును దొంగలు అపహరించడంతో పోలీసులను ఆశ్రయించారు. వివరాలు... మీరట్‌కు చెందిన సునీతా చౌదరి ఢిల్లీలో ఆటో నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గత పదిహేనేళ్లుగా తమకు జీవనాధారంగా ఉన్న ఆటో పాడైపోవడంతో మరో ఆటో కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సొంత గ్రామానికి వెళ్లి తెలిసిన వాళ్ల దగ్గర 30 వేల రూపాయలు తీసుకున్నారు. అనంతరం ఢిల్లీకి పయనమయ్యారు.

ఈ నేపథ్యంలో మోహన్‌ నగర్‌లో బస్‌ దిగిన సునీత.. ఆనంద్‌ విహార్‌ వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు ప్యాసింజర్లు ఎక్కడంతో తన బ్యాగును వెనుక పెట్టాల్సిందిగా ఆటో డ్రైవర్‌కు సునీతకు సూచించాడు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత ఇంజన్‌లో సమస్య ఉందంటూ ఆటోను ఆపి సునీతను దిగమని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత ఆమె బ్యాగు ఇచ్చేసి.. ఆమె ఆటో ఎక్కకముందే స్టార్ట్‌ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో చేసేదేమీ లేక సునీత మరో ఆటోలో ఎక్కారు. అయితే బ్యాగు తెరచి చూడగా అందులో ఉన్న డబ్బు కనిపించకపోవడంతో తాను మోసపోయిన విషయాన్ని గుర్తించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు