ఎన్‌ఆర్‌ఐలే టార్గెట్‌..

7 Apr, 2018 13:12 IST|Sakshi

అంతర్జాతీయ స్థాయిలోదందా

ఇమ్మిగ్రేషన్‌లో తప్పుడు    ఎంట్రీల పేరు చెప్పి బెదిరింపులు

అరెస్టు కాకుండా చూస్తామంటూ భారీగా డిమాండ్‌

కోల్‌కతా కేంద్రంగా కథ నడిపిన ప్రధాన సూత్రధారి అవినాష్‌

ఏజెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన జమీల్‌ కీలకపాత్ర

ఇంటర్‌పోల్‌ సమాచారంతో నిందితుడి అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులను (ఎన్‌ఆర్‌ఐ) టార్గెట్‌గా చేసుకుని భారీ స్కామ్‌ జరిగింది. కోల్‌కతా కేంద్రంగా వ్యవహారం నడిపిన కీలక సూత్రధారి అవినాష్‌ రూ.కోట్లల్లో దండుకున్నాడు. దేశంలోకి వీరి రాకపోకలకు సంబంధించిన వివరాలు వివిధ మార్గాల్లో సేకరించిన ఇతను ‘రాంగ్‌ ఎంట్రీల’ పేరుతో బెదిరింపులకు దిగాడు. అరెస్టు కాకుండా చూస్తానంటూ భారీ మొత్తాలు డిమాండ్‌ చేశాడు. ఈ డబ్బును తనకు చేర్చేందుకు అన్ని నగరాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో హైదరాబాద్‌కు చెందిన జమీల్‌ ఒకడు. సింగపూర్‌ ప్రభుత్వం ద్వారా ఇంటర్‌పోల్‌కు చేరిన ఈ స్కామ్‌ సమాచారం చివరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్దకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గురువారం జమీల్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అవినాష్‌ చిక్కితే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని సైబర్‌ క్రైమ్‌ అధికారులు పేర్కొంటున్నారు. 

ప్రధానంగా ఆ దేశాల్లోని వారే...
కోల్‌కతాకు చెందిన అవినాష్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలను టార్గెట్‌గా చేసుకున్నాడు. అయితే అమెరికా, లండన్‌ తదితర దేశాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున ఆయా దేశాల్లో ఉంటున్న వారిని మోసం చేయడం కష్టమని భావించిన అతను  సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, బ్యాంకాక్, ఫిలిప్పీన్స్, సౌత్‌ ఆఫ్రికా తదితర దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులను ఎంచుకున్నాడు. వీరు వివిధ సందర్భాల్లో భారత్‌కు వచ్చిన వెళ్లిన వివరాలతో పాటు వారి విదేశీ చిరునామా, ఫోన్‌ నెంబర్లను వివిధ మార్గాల్లో సంగ్రహించాడు. కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసిన అవినాష్‌ అందులో పని చేసే వారికి ఇమ్మిగ్రేషన్‌ చట్టం, నిబంధనలు, పదజాలంపై శిక్షణ ఇప్పించాడు. అనంతరం ఆయా కాల్‌ సెంటర్ల నుంచి టార్గెట్‌ చేసుకున్న ఎన్‌ఆర్‌ఐలకు ఫోన్లు చేయించేవాడు. అవతలి వ్యక్తుల పాస్‌పోర్ట్‌ నెంబర్ల ఆధారంగా కాల్‌ సెంటర్‌ సిబ్బంది ఫలానా సందర్భంలో మీరు భారత్‌కు వచ్చి వెళ్లారని చెప్పేవారు. ఈ విషయాన్ని ఎన్‌ఆర్‌ఐ అంగీకరిస్తే... ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల్లో మీరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు చెప్పారని, ఇందుకుగాను మీపై కేసు నమోదైందని, మరోసారి భారత్‌కు వచ్చేప్పుడు విమానాశ్రయంలోనే అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైందంటూ బెదిరించేవారు. కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు చెప్పే వివరాలు, వినియోగించే పదజాలం నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐలు బెదిరిపోయేవారు.  

దేశ వ్యాప్తంగా ‘కలెక్షన్‌ ఏజెంట్లు’...
ఇలా తమ దారికి వచ్చిన ఎన్‌ఆర్‌లతో అవినాష్‌ నేరుగా సంప్రదింపులు జరిపేవాడు. కేసు మాఫీ అయ్యేలా, అరెస్టు కాకుండా న్యాయసహాయం అందిస్తానని, అందుకు న్యాయవాది ఖర్చులు చెల్లించాలంటూ భారీ మొత్తాలు డిమాండ్‌ చేసేవాడు. ఈ డబ్బును వివిధ మార్గాల్లో తనకు చేర్చేందుకుగాను దేశ వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వారిలో గోల్కొండ ప్రాంతానికి చెందిన జమీల్‌ ఒకడు. వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థలో పని చేస్తున్న ఇతను ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా కొన్నాళ్ల క్రితం ‘టెక్‌ సపోర్ట్‌ గ్రూప్‌’లో చేరాడు. ఇదే గ్రూప్‌నకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూప్‌ ఉన్నట్లు తెలుసుకున్న జమీల్‌ అందులో తనను యాడ్‌ చేయాలంటూ తన సెల్‌ నెంబర్‌ను పోస్ట్‌ చేశాడు. రెండు రోజులకే ఆ గ్రూప్‌లో చేరిపోయిన జమీల్‌ను దాని ద్వారానే అవినాష్‌ ట్రాప్‌ చేశాడు. వివిధ లావాదేవీలకు సంబంధించి విదేశాల నుంచి డబ్బు వస్తుందని, దానిని తనకు చేరిస్తే 15 శాతం కమీషన్‌ ఇస్తానని చెప్పడంతో జమీల్‌ అంగీకరించాడు. ఈ దందాలోకి దిగాలంటే నీ పేరుతోనూ వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ఫ్రాంచైజీ ఉండటం అనివార్యమని చెప్పాడు. భారీ మొత్తం లావాదేవీలు జరుగుతాయని చెప్పడంతో కమీషన్‌ కోసం ఆశపడిన జమీల్‌ కొన్ని నెలల క్రితం గోల్కొండ ప్రాంతానికి సంబంధించి ఓ ఫ్రాంచైజీ తీసుకున్నాడు. ఈ విషయం నిర్థారించుకున్న అవినాష్‌ అసలు కథ ప్రారంభించాడు.

నకిలీ గుర్తింపులు, ఎంటీసీఎన్‌ కోడ్‌తో....
వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థ ద్వారా విదేశాల నుంచి దేశంలోకి డబ్బు పంపే వ్యక్తికి అక్కడి శాఖలో ఆ మొత్తాన్ని జమ చేసి డబ్బు అందుకోవాల్సిన వ్యక్తి పేరు, చిరునామా రికార్డు చేయిస్తాడు. దీంతో ఆ సంస్థ డబ్బు జమ చేసిన వ్యక్తికి ఓ ఎంటీసీఎన్‌ కోడ్‌ ఇస్తుంది. ఇక్కడ డబ్బు రిసీవ్‌ చేసుకునే వ్యక్తి ఆ కోడ్‌ చెప్పడంతో పాటు తన గుర్తింపుకార్డు చూపిస్తే నగదు చెల్లింపు జరిగిపోతుంది. దీంతో అవినాష్‌ జమీల్‌ ద్వారా దాదాపు 100 మంది పేర్లు, చిరునామాలతో బోగస్‌ గుర్తింపు కార్డులు తయారు చేయించాడు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల చిరునామాలతో రూపొందిన వీటి వివరాలను జమీల్‌ ద్వారా తెలుసుకున్నాడు. ఆపై తన వలలో పడిన ఎన్‌ఆర్‌ఐకి ఒక్కో గుర్తింపుకార్డులోని వివరాలు చెప్పి డబ్బు పంపమని చెప్పేవాడు. దీంతో ఆ దేశంలో ఉన్న ‘వెస్ట్రన్‌’ సంస్థలో సదరు పేరుతో నగదు జమ చేసే ఎన్‌ఆర్‌ఐ ఎంటీసీఎన్‌ కోడ్‌ను అవినాష్‌కు చెప్పేవాడు. ఈ కోడ్, ఎవరి పేరుతో నగదు వస్తోందనే వివరాలను ఇతను జమీల్‌కు అందించేవాడు. దీంతో ఆ కోడ్‌ను వినియోగించి, తన వద్దే ఉన్న బోగస్‌ గుర్తింపుకార్డు దాఖలు చేసే జమీల్‌ ఆ మొత్తాన్ని తన ఫ్రాంచైజీ నుంచి తన బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకునే వాడు. అనంతరం తన వాటా 15 శాతం పోగా, మిగతా మొత్తాన్ని కోల్‌కతాకు చెందిన అవినాష్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసేవాడు. ఇలాంటి లావాదేవీల కోసం అవినాష్‌ దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ కమీషన్‌ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రూ.కోట్లు దండుకున్నాడు. కేవలం కొన్ని నెలల్లోనే జమీల్‌ ద్వారానే రూ.కోటికి పైగా ‘ఎన్‌ఆర్‌ఐల డిపాజిట్లు’ సేకరించాడు. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన వెస్ట్రన్‌ యూనియన్‌ సంస్థ జమీల్‌ ఫ్రాంచైజీని రద్దు చేసింది.  

సింగపూర్‌ నుంచి వచ్చిన సమాచారంతో...
ఇదే తరహాలో ఫోన్లు రావడంతో సింగపూర్‌కు చెందిన 14 మంది ఎన్‌ఆర్‌ఐలకు ఈ వ్యవహారంపై అనుమానం వచ్చింది. దీంతో వారు అక్కడి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీరికి సంబంధించి భారత్‌లో నమోదైన ఇమ్మిగ్రేషన్‌ వివరాలు తనిఖీ చేసిన సింగపూర్‌ ప్రభుత్వం ఎలాంటి కేసులు లేవని, ఇదో భారీ స్కామ్‌గా అనుమానించింది. కోల్‌కతా కేంద్రంగా జరిగినట్లు భావించడం, హైదరాబాద్‌కు చెందిన వారు సహకరించారనే అనుమానాలు ఉండటంతో ఇంటర్‌పోల్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆ విభాగం నుంచి సమాచారం అందుకున్న సీబీఐ, రాష్ట్రంలో సీఐడీని అప్రమత్తం చేసింది. సీఐడీ సైబర్‌ క్రైమ్‌ అధికారులు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయాల్సిందిగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ ఈ కేసు దర్యాప్తు చేశారు. గురువారం జమీల్‌ ను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ప్రధాన సూత్రధారి అవినాష్‌ను పట్టుకుంటేనే స్కామ్‌ మొత్తం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇందుకుగాను జమీల్‌ను కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఇంటర్నేషనల్‌ స్కామ్‌పై స్వయంగా ఇంటర్‌పోల్‌ ఆరా తీస్తుండటంతో కేసుకు సైబర్‌ క్రైమ్‌ అధికారులు కీలక ప్రాధాన్యం ఇచ్చి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు