రైలు ప్రయాణంలో జాగ్రత్త సుమా!

10 May, 2018 10:58 IST|Sakshi
మాక్‌డ్రిల్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్న రైల్వే సిబ్బంది

రైళ్లలో మోసాల తీరును మాక్‌ డ్రిల్‌ ద్వారా వివరించిన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది 

హైదరాబాద్‌ : రైలు ప్రయాణికులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో వారు ఏవిధంగా మోసం చేస్తారో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బేగంపేట రైల్వేస్టేషన్‌లో మాక్‌డ్రిల్‌ ద్వారా తెలియజేశారు. ప్రయాణికుల వద్దకు వచ్చి ఎలా పరిచయం చేసుకుంటారు, తినుబండారాలను ఏవిధంగా అందిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. మత్తుమందు కలిపిన తినుబండారాలు తిని ప్రయాణికులు ఏవిధంగా స్పృహ కోల్పోతారు, అనంతరం దుండగులు వారి వద్ద నుంచి నగదు, నగలు దోపిడీ చేసే విధానాన్ని ప్రాక్టికల్‌గా చూపించారు.

చిన్న పిల్లలను ఏవిధంగా లాలించి ఎత్తుకెళతారో ప్రదర్శన ద్వారా చూపించారు. మహిళా రక్షణ, బాలల అక్రమ రవాణా, డ్రగ్స్‌ రవాణా వంటి వాటిపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే టికెట్‌ వెనుక వైపు ఉన్న 182 హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రామకృష్ణ, అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ బి.శ్రీనివాసరావు, రైల్వేడీఆర్‌ఎం ఆశీష్‌అగర్వాల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం రైలులో జరిగే మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ క్రమంలో వారికి తెలియజేసేందుకు రైల్వే ఫ్లాట్‌ఫారంలపై ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.  

మరిన్ని వార్తలు