‘సమత’గా పేరు మార్పు: ఎస్పీ

10 Dec, 2019 08:56 IST|Sakshi
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న భట్టి విక్రమార్క

సమత’నిందితులను  కఠినంగా శిక్షించాలి

సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క

ఎల్లాపటార్‌లో సంఘటన స్థలం పరిశీలన

గోసంపల్లెలో బాధితురాలి కుటుంబానికి పరామర్శ

సాక్షి, ఖానాపూర్‌(ఆదిలాబాద్‌) : దిశ కేసులో లాగే కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత ఘటనలోనూ సమ న్యాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోరాటం చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సోమవారం ఆయన సీఎల్పీ నాయకులతో కలిసి ఎల్లాపటార్‌లోని సంఘటన ప్రాంతాన్ని, ఖానాపూర్‌ మండలంలోని గోసంపల్లెలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నాచితక పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సమతను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం, హత్య చేయడం అత్యంత పాశవికంగా ఉందన్నారు. ఈ ఘటన అందరినీ కలిచివేసిందన్నారు. మహిళలపై దాడులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రాంలో ఇటీవల కాలంలో సుమారు 15 మందిపై అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. అత్యాచార ఘటనలన్నింటినీ ఒకేలా చూస్తూ ఒకే కోర్టు ద్వారా విచారించి తక్షణమే శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరపున బాధిత కుటుంబానికి రూ.లక్ష అందజేశారు.

సంఘటితంగా పోరాడుదాం..
అత్యాచారాలు, హత్యలపై సంఘటితంగా పోరాడుదామని సీఎల్పీ నేతలు పేర్కొన్నారు. పాలకులు అగ్రవర్ణాలు, దళితులను వేర్వేరుగా చూడొద్దన్నారు. ఎల్లాపటార్‌ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మద్యం మత్తుతోనే ఇలాంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామాల్లో బెల్టు షాపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. ఎల్లాపటార్‌ ఘటనను పార్లమెంట్‌లో చర్చించేలా టీపీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ ఘటనలన్నింటినీ ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిదులు కె.విశ్వప్రసాద్, లక్ష్మణ్‌రెడ్డి, లచ్చన్న, మహేశ్, మోహిద్, ఆకుల శ్రీనివాస్, వాల్‌సింగ్, మాజిద్, శంకర్, మహేందర్, సాగర్, శంకర్‌గౌడ్, రవీందర్, శ్రీనివాస్, మల్లయ్య, నారాయణ, ప్రదీప్, గంగాదర్‌ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిన సీఎం
ఖానాపూర్‌: రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చడంతో పాటు మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కేరాఫ్‌గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. పొట్టకూటి కోసం వెళ్లిన వివాహితను దుండగులు కనికరం లేకుండా అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్యచేశారన్నారు. దిశ నిందితులకు ఒక న్యాయం.. ‘సమత’కు మరో న్యాయం సరికాదని మహిళలందరికీ సమన్యాయం జరగాలని అన్నారు.

12, 13న బీజేపీ ఆందోళనలు
రాష్ట్రంలో మద్యం నిషేధించాలని కోరుతూ ఈనెల 12,13 తేదీల్లో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు అరుణ పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ టేకు గంగారాం, మహిళ మోర్చా అధ్యక్షురాలు విజయ, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు రావుల రాంనాథ్, తోకల బుచ్చన్న, పడాల రాజశేఖర్, టేకు ప్రకాశ్, నాయిని లక్ష్మణ్, దాదె మల్లయ్య, వేణు, రాజేశ్వర్‌ తదితరులున్నారు.  

‘సమత’గా పేరు మార్పు
ఆసిఫాబాద్‌అర్బన్‌: గత నెల 24న లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ పేరును సమతగా మార్చుతున్నట్లు ఎస్పీ మల్లారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి బాధితురాలి పేరును సమతగా పేర్కొనాలని సూచించారు. సోషల్‌ మీడియా, తదితర వాటిల్లోనూ సమతగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన విచారణ జరిపేందుకు కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు వెల్లడించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. మృతురాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతినెలా పెన్షన్, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్‌ అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. నిందితులను చట్ట ప్రకారం శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా