పట్ట పగలు ఒంగోలులో భారీ చోరీ

31 Oct, 2018 13:24 IST|Sakshi
చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ ప్రసాద్‌

స్థానిక నిర్మల్‌ నగర్‌లో ఘటన

ముగ్గురు అనుమానాస్పద యువకుల గుర్తింపు

ప్రకాశం , ఒంగోలు: పట్టపగలు స్థానిక నిర్మల్‌నగర్‌ పార్కు ఎదురుగా ఉన్న వీధిలోని ఒక ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం శివకుమార్‌ అనే వ్యక్తి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రికవరీ వింగ్‌లో పనిచేస్తుంటాడు. ఆయన భార్య స్థానిక నిర్మల ఒలంపియాడ్‌ స్కూలులో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరు కోటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కోటేశ్వరరావు పైభాగంలో నివాసం ఉంటూ దిగువ భాగంలో ఉన్న రెండు పోర్షన్లను అద్దెకు ఇచ్చారు. ఒక భాగంలో శివకుమార్‌ కుటుంబం ఉండగా రెండో పోర్షన్‌లో ఒక అకౌంట్స్‌ కార్యాలయం పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అకౌంట్స్‌ కార్యాలయంలో ఉండే ఉద్యోగి బ్యాంకు పని నిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి ఆమె 12.30 గంటలకు వచ్చేసరికి పక్క పోర్షన్‌ తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంటి గల వారే అయి ఉంటారని ఆమె పట్టించుకోకుండా తన కార్యాలయంలో వి«ధుల్లో నిమగ్నమైంది.

తరువాత కొద్దిసేపటికి శివకుమార్‌ సతీమణి వచ్చి తలుపులు తీసి ఉండడంతో దిగ్భ్రాంతికి గురైంది. బయట గ్రిల్స్‌కు వేసి ఉన్న తాళం పగలగొట్టి ఉండడం, లోపల బీరువా తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి భర్తకు సమాచారాన్ని చేరవేసింది. దీంతో ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకొని తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. మొత్తంగా 16 సవర్ల బంగారం, రూ.2.50 లక్షల నగదు, రూ.50 వేల విలువ చేసే వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. వేలిముద్రల నిపుణులు ఇంటికి చేరుకొని వేలిముద్రలు సేకరించగా ఎస్సై ఎన్‌సి ప్రసాద్‌ సమీపంలోని ఇళ్లకు బిగించి ఉన్న సీసీ పుటేజి సేకరణపై దృష్టిసారించారు. ఈ క్రమంలో ఒక అపార్టుమెంట్‌ ముందు నుంచి వచ్చిన ముగ్గురు యువకులలో ఒకరు రోడ్డుపై నిలబడి ఉండగా మిగిలిన ఇద్దరు ఇంటిలోకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపించడంతో ఆగంతకులు వారే అయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఒక వైపు పార్కు, మరో వైపు అపార్టుమెంట్‌ , ఇంకో వైపు ఆసుపత్రి, ఇంటికి ముందు వైపు ఉమన్‌ హాస్టల్‌ ఉండగా మిట్ట మధ్యాహ్నం కేవలం అరగంట వ్యవధిలోనే చోరీ జరగడం పట్ల స్థానికులు సైతం తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాలూకా ఎస్సై ఎన్‌సి ప్రసాద్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు