గ్యాంగ్‌స్టర్‌ కాల్పుల్లో పోలీసు మృతి

13 Oct, 2018 11:04 IST|Sakshi
పోలీసు అధికారి ఆశిష్‌ కుమార్‌ మృతదేహాన్ని తరలిస్తోన్న తోటి పోలీసులు

ఖగారియా(బిహార్‌): గ్యాంగ్‌స్టర్లకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆశిష్‌ కుమార్‌(32) అనే పోలీసు అధికారి మృతిచెందారు.  ఈ సంఘటన ఖగారియా జిల్లాలోని గంగా నదిలో ఉన్న సలార్‌పూర్‌ డైరా
అనే చిన్న దీవిలో చోటుచేసుకుంది. ఆ దీవిలో కరడుగట్టిన నేరస్తుడు దినేష్‌ ముని గ్యాంగ్‌ సభ్యులు తలదాచుకున్నారని సమాచారం రావడంతో ఆశిష్‌ కుమార్‌, మరో నలుగురు పోలీసులతో కలిసి సలార్‌పూర్‌ దీవి వద్దకు బయలుదేరారు. పోలీసులు రావడం గమనించి దినేష్‌ ముని గ్యాంగ్‌ కాల్పులుకు దిగింది. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు.

ముని గ్యాంగ్‌ జరిపిన కాల్పుల్లో ఒక బుల్లెట్‌ ఆశిష్‌ కుమార్‌ ఛాతీలోకి దూసుకెళ్లటంతో ఆయన అక్కడిక్కడే చనిపోయినట్లు తోటి పోలీసులు తెలిపారు.  పోలీసుల కాల్పుల్లో కూడా దినేష్‌ ముని గ్యాంగ్‌ సభ్యుడొకరు కూడా చనిపోయినట్లు తెలిసింది. కాల్పులు విషయం తెలియడంతో మరిన్ని బలగాలు సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. సాధారణంగా సలార్‌పూర్‌ డైరా దీవిలో ఎక్కువగా కరడుగట్టిన నేరస్తులు దాక్కుంటారని సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ దినేష్‌ మునిని పట్టుకున్నారా లేదా అనేది పోలీసులు వెల్లడించలేదు.

స్థానిక గ్యాంగ్‌స్టర్లకు, పోలీసులకు మధ్య ఇదే దీవిలో గత సంవత్సరం కాల్పులు జరిగాయి. ఆ దాడిలో ఓ పోలీసు అధికారికి బుల్లెట్‌ గాయాలు కూడా అయ్యాయి. ఆశిష్‌ కుమార్‌ ఒక ధైర్యవంతుడైన పోలీసుల అధికారి అని తోటి పోలీసులు తెలిపారు. ఆయన తల్లి కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆశిష్‌ సోదరుల్లో ఒకరు బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తుండగా..మరొకరు సివిల్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆశిష్‌ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని స్ధానిక మీడియా కొనియాడింది.

మరిన్ని వార్తలు