అంగట్లో చిన్నారులు

8 Feb, 2020 11:03 IST|Sakshi

నవజాత శిశువుల విక్రయ ముఠా గుట్టురట్టు

అల్వాల్‌: సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులతోపాటు మారుమూల ప్రాంతాల నిరుపేద కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా తీసుకొని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు.  సంతానం కోసం ఆస్పత్రులను వస్తున్న వారిని చూసి కొందరు ముఠాగా ఏర్పడ్డారు. నగరంలోని పేరు మోసిన సంతాన సాఫల్య కేంద్రాలకు అద్దె గర్భాలను అందించే దళారులుగా పని చేస్తూనే శిశువుల అక్రమ రవాణాకు తెర లేపారు.  అయితే  నవ శిశువులను నేరుగా అమ్మితే లక్షలు సంపాదించ వచ్చనే దుర్భుద్ది వారికి కలిగింది. దీంతో పేద బలహీన వర్గాలను టార్గెట్‌  చేశారు. పేద మహిళలకు డబ్బు ఆశచూపేవారు. అక్రమ మార్గంలో మహిళలు పిల్లలకు జన్మనిచ్చే స్థాయికి వీరు వ్యాపారం సాగింది. జన్మనిచ్చిన మహిళ కుటుంబాలకు కొంత నగదు ఇచ్చి శిశువును ఇతరులకు లక్షలకు అమ్మడం ప్రారంభమైంది.  

సాఫల్య కేంద్రాలతో తమకు ఉన్న పరిచయాలతో సంతానం కలగని దంపతులను గుర్తించి వారితో ఒప్పందాలు చేసుకోవడం మొదలు పెట్టారు. 2015  నుంచి ఈ ముఠా మానవ అక్రమ రవాణాను కొనసాగించగా ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. గతనెల 27న అల్వాల్‌ పైపులైను రోడ్డులో ఇద్దరు మహిళలు పది రోజుల వయస్సున్న శిశువును అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అల్వాల్‌ పోలీసులకు అందింది. దీంతో బాలానగర్‌ ఎస్‌ఓటి, అల్వాల్‌ పోలీసులు కోట మారుతి శమంతక మణి(41) కుంతి రేణుక(35)లను అదుపులోని తీసుకున్నారు.
వారిచ్చిన సమాచారంతో డీసీపీ పద్మజ ప్రత్యే బృందాలను రంగంలోకి దించారు. దమ్మాయిగుడాలో నివాసముంటున్న కడప జిల్లావాసి మేముల బాబురెడ్డి(43), కుత్బుల్లాపూర్‌ గాజుల రామారంలో నివసిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లావాసి వాకపల్లి గంగాధర్‌రెడ్డి(33)లు ముఠాకు నాయకులుగా గుర్తించారు.

తూర్పు గోదావారి జిల్లా రాజమండ్రి ప్రాంతానికి చెందిన బిక్కవోలు రమేష్‌(30), గుంటూరు జిల్లా మానసపెట గ్రామానికి చెందిన రాజానాయక్‌(26),  మూసారాంబాగ్‌కు చెందిన కోట మారుతి శమంతకమణి, యాప్రాల్‌ బాలాజీనగర్‌లో నివసించే కాంతి రేణుక, ముషీదాబాద్‌ గంగపుత్ర కాలనీ నివాపి జలిగామ సునీత(33), రాంనగర్‌కు చెందిన వనమాల లక్ష్మీ(25)లను తమ ఏజెంట్లుగా ప్రధాన నిందితులు బాబురెడ్డి, గంగాధర్‌రెడ్డిలు నియమించుకున్నారు. బిడ్డలు లేని దంపతులకు అప్పటికే శిశువులను విక్రయించారు.వీరు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు దళారులుగా వ్యవహరిస్తున్నారు. అమీర్‌పేట్‌ రమా ఫెర్టిలిటీ సెంటర్, హబ్సిగూడ పద్మజ ఫెర్టిలిటీ సెంటర్, మారేడ్‌పల్లిలోని ప్రెటీ–9, కింగ్‌కోఠి కామినేని ఫెర్టిలిటీ సెంటర్, జీవికే మాల్‌ సమీపంలోని నేవ ఐవిఎఫ్‌ సెంటర్, పంజాగుట్ట, సికింద్రాబాద్‌లోని ఉమెన్స్‌ ఆసుపత్రి, బేగంపేట్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలకు బ్రోకర్లుగా ఉండడం విశేషం. ప్రధాన నిందితుడు బాబురెడ్డిని పోలీసులు గతంలోనే రిమాండ్‌కు తరలించారు. గంగాధర్‌రెడ్డిపై పలు స్టేషన్లలలో కేసులు నమోదై ఉన్నాయి.ఈ ముఠా వెనుక ఎవరైన ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు