సెలవులకు వచ్చాడు..శవమైపోయాడు

17 May, 2018 12:11 IST|Sakshi
నీటమునిగి మరణించిన కిశోర్‌

కళ్లెదుటే నీళ్లలో మునిగిపోతున్నా

ఏమీ చేయలేని స్థితిలో పినతండ్రి

కడప, జమ్మలమడుగు రూరల్‌: వేసవి సెలవులను పినతండ్రి, తాతల వద్ద గడపాలని ఆ బాలుడు(14) ప్రకాశం జిల్లా కంభం నుంచి మండల పరిధిలోని గూడెం చెరువుకు వచ్చాడు. పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లి శవమై పోయాడు. సుబ్రమణ్యం, మహాలక్ష్మీల ఏకైన సంతానమైన కిశోర్‌ బుధవారం తాత, పినతండ్రి శివలతో కలిసి పెన్నానదిలో ఈతకోసం వెళ్లాడు. అయితే ఈత రాని కిశోర్‌ నీటిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించాడు.  ఈత కాని కారణంగా బాలుడు నీటిలో మునిగిపోతుండటంతో పినతండ్రి శివ రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి కూడా ఈత రాకపోవడంతో కళ్ల ముందే మునిగిపోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. సెలవుల కోసం వచ్చిన తమ కుమారుడు ఇలా నీట మునిగి మరణించడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

పార్నపల్లెలో ఇంటర్‌ విద్యార్థి
లింగాల : మండలపరిధిలోని పార్నపల్లె గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని సెలవుల్లో ఇంటికి వచ్చి బుధవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన మోదుపల్లె అజిత్‌ అనే విద్యార్థి సంప్‌లో ఈత కొడుతూ మృతి చెందాడు. గ్రామానికి చెందిన ప్రభాకరనాయుడు, మంజుల దంపతులకు అజిత్‌ ఏకైక కుమారుడు. వీరికి లాస్య అనే కుమార్తె ఉంది. ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. తండ్రి ప్రభాకర్‌ నాయుడు కుమారుడు ఈత కొడుతున్న సంప్‌ వద్ద ఉండగానే ఈ సంఘటన జరిగింది. వెంటనే నీటిలో నుంచి వెలికితీసి చికిత్స కోసం పులివెందుల ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అజిత్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  

మరిన్ని వార్తలు