ఆ హెయిర్‌ స్టైలే పట్టించింది

14 May, 2019 10:35 IST|Sakshi
నిందితుడి ప్రత్యేక హేర్‌ స్టైల్‌ సీసీ కెమెరాలో నిందితుడి చిత్రాలు, నిందితుడి చెప్పులు

బాలుడి హత్య కేసులో నిందితుడి రిమాండ్‌.  

సీసీ కెమెరాల ఆధారంగా పట్టివేత

చాంద్రాయణగుట్ట: బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నగర టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చైతన్య కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.వాదే ముస్తఫా బసీకి చెందిన మహ్మద్‌ పాషా కుమారుడు మహ్మద్‌ యాసిన్‌ (7) ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8న రాత్రి అతను కూల్‌డ్రింక్‌ తెచ్చుకునేందుకు సమీపంలో ఉన్న కిరాణ దుకాణానికి వెళ్లాడు. ఒంటరిగా బాలుడు వస్తుండటాన్ని గుర్తించిన న్యూ హుడా కాలనీకి చెందిన ఉమర్‌ బిన్‌ హసన్‌ అతడిని వద్దకు వెళ్లి మాటల్లో పెట్టి మరో దుకాణానికి వెళదామని చెప్పాడు. అయితే యాసిన్‌ అందుకు అంగీకరించకపోవడంతో అతని వద్ద ఉన్న రూ.50 లాక్కొన్నాడు. దీంతో బాలుడు డబ్బులు ఇవ్వాలని కోరగా అతడిని వాటర్‌ ట్యాంక్‌ లేన్‌లోని ప్రహారీలోకి తీసుకెళ్లి భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు.   బాలుడి కేకలు విని సమీపంలోని ఇంట్లో నుంచి నమాజ్‌ చేసేందుకు కిందికు వస్తున్న మహిళ గుర్తించి సెల్‌ఫోన్‌ టార్చ్‌ లైట్‌ వేసింది. దీంతో భయపడిన హసన్‌ తాను ఎక్కడ దొరికి పోతానేమోనని బాలుడి జుట్టు పట్టుకొని భలంగా బండకేసి బాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  

హెయిర్‌ స్టైల్, చెప్పుల ఆధారంగా దర్యాప్తు..
హత్య జరిగిన ప్రాంతం ఇటు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని దక్షిణ మండలానికి....అటు రాచకొండ కమిషనరేట్‌ సరిహద్దులోని బాలాపూర్‌ ఠాణా పరిధిలో ఉండటంతో దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించడంతో పాటు స్థానికులను విచారించారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి 200 మీటర్ల దూరంలో ఎరుపు రంగు స్లిప్పర్లు చేతిలో పట్టుకొని ఓ యువకుడు పరిగెత్తడాన్ని గుర్తించారు. అయితే వెనుక భాగం నుంచి మాత్రమే అతడి ఆనవాళ్లు రికార్డయ్యాయి. హెయిర్‌ స్టైల్‌ ప్రత్యేకంగా ఉండడంతో దాని ఆధారం గా పోలీసులు దర్యాప్తు చేశారు.

సదరు యువకుడి శరీరం, వీడియోలో రికార్డై ఉన్న దుస్తుల ఆధారంగా కూపీ లాగారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నిందితుడి వివరాలు గుర్తించారు. చెప్పుల రంగు...వేసుకున్న వస్త్రాలు....కాస్తా బలహీనంగా ఉన్న అతను హుడా కాలనీకి చెందిన ఉమర్‌ బిన్‌ హసన్‌గా స్పష్టమైంది. దీంతో అతడి ఇంటి పరిసరాల్లో విచారించగా, హత్య జరిగిన రోజు నుంచి నిందితుడు ఇంట్లో సక్రమంగా ఉండకపోవడం, అతని ముఖంలో భయం ఛాయలు ఉన్నట్లు కూడా స్థానికులు పేర్కొన్నారు. దీంతో దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఎస్సైల బృందం ఎన్‌.శ్రీశైలం, కె.ఎన్‌. ప్రసాద్‌ వర్మ, వి.నరేందర్, మహ్మద్‌ తఖియుద్దీన్‌ సోమవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి తదుపరి విచారణ నిమిత్తం బాలాపూర్‌ పోలీసులకు అప్పగించారు. స్థానిక ప్రజలు నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలే నిందితుడిని పట్టించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు