బతికున్న యువకుడిని చంపేశారంటూ..

1 Feb, 2019 11:15 IST|Sakshi
బ్రెయిన్‌డెడ్‌ అయిన భాను ఆందోళన చేస్తున్న భాను కుటుంబసభ్యులు

గాంధీ ఆస్పత్రి ఎదుట ధర్నా

బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన

బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు సమాచారం అందించామని వైద్యుల వెల్లడి

గాంధీఆస్పత్రి : గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బతికున్న యువకుడిని చనిపోయాడని నిర్ధారించారని ఆరోపిస్తూ బాధిత యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, ఆస్పత్రి అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పఠాన్‌చెరువుకు చెందిన భాను (19) గత నెల 28న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అతడిని 30న గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు భాను బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్లు నిర్ధారిస్తూ ఈ విషయాన్ని అతడి  కుటుంబ సభ్యులకు చెప్పారు.

బ్రెయిన్‌ డెడ్‌ను, డెత్‌ (మృతి చెందినట్లు) గా భావించిన వారు బంధువులకు సమాచారం అందించారు. ఎంఎల్‌సీ కేసు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఓ కానిస్టేబుల్‌ భానును పరీక్షించగా నాడీ కొట్టుకుంటుండటాన్ని గుర్తించి బతికే ఉన్నట్లు తెలిపాడు. దీంతో ప్రాణం ఉండగానే చనిపోయినట్లు ఎలా నిర్ధారిస్తారని భాను  బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే భాను మృతి చెందాడని తాము చెప్పలేదని బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు మాత్రమే పేర్కొన్నామని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  గురువారం ఉదయం టీఎంటీ వార్డులో భాను కుటుంబ సభ్యులను తాను స్వయంగా కలిసి పరిస్థితి  వివరించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. పల్స్‌ రికార్డు కావడం లేదని చెబితే మృతి చెందినటు అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు