మరదలిని చంపిన బావ

6 Jun, 2020 11:30 IST|Sakshi

దామగట్లలో ఘటన

నందికొట్కూరు: సొంత తమ్ముడి భార్య, మరదలు అని కూడా చూడకుండా గొడ్డలితో నరికి చంపాడు ఓ వ్యక్తి. మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ జయశేఖర్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న ఏసన్న, పుష్పరాజు అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. ఇదే విషయమై తమ్ముడి భార్య శ్రీలేఖ(35)తో చిన్న ఏసన్న శుక్రవారం గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడై గొడ్డలితో మెడపై విచక్షణా రహితంగా నరికాడు. రక్తపు మడుగులో పడివున్న బాధితురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    

భార్యపై కత్తితో దాడి: తానూ ఆత్మహత్యాయత్నం
ఆళ్లగడ్డ: భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలు చివరికి ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. పట్టణంలోని ఎస్వీ నగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు సీఐ సుబ్రమణ్యం తెలిపిన  మేరకు ఇలా ఉన్నాయి.. ఎస్వీ నగర్‌లో అల్లూరి కిరణ్, సుబ్బమ్మ దంపతులు నివసిస్తున్నారు. సుబ్బమ్మ పుట్టినిల్లు కూడా ఇదే నగర్‌ కావడంతో రోజూ తల్లిదండ్రుల మాటలు విని.. తనతో గొడవ పడుతుందని భర్త అల్లూరి కిరణ్‌ క్షణికావేశానికి లోనై భార్యపై కత్తితో దాడి చేశాడు. తానూ కత్తితో ఎడమ చేతికి కోసుకున్నాడు. సుబ్బమ్మ కేకలు వేస్తూ బయటికి రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరినీ ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా