వేకువనే విషాదం

29 Aug, 2018 12:06 IST|Sakshi
ధ్వంసమైన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దృశ్యాలు

ఆర్టీసీ బస్సును వెనుక నుంచీ ఢీకొట్టిన ప్రైవేటు బస్సు  

నలుగురు దుర్మరణం  

15 మందికి గాయాలు  

తుమకూరు జిల్లాలో ఘోర ప్రమాదం

తుమకూరు: ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. కొంతసేపట్లో గమ్యం చేరుకునేవారే, ఇంతలో విధి వక్రించింది. ముందు వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ బస్సును అధిగమించే ప్రయత్నంలో ప్రైవేటు ట్రావెల్స్‌ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా 15 మందికి గాయాలైన ఘటన తుమకూరు జిల్లా శిరా తాలూకాలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున హుబ్లి నుంచి బెంగళూరుకు వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ బస్సును– చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు హైవే– 48పై కళ్లంబెళ్ల గ్రామ సమీపాన ఓవర్‌టేక్‌కు యత్నిస్తూ అదుపుతప్పి వెనుక ఢీకొట్టింది. ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ వేగాన్ని నియంత్రించడంలో విఫలమయ్యాడు. వేగంగా ఢీకొనడంతో ట్రావెల్స్‌ బస్సులోని నిఖిత (27),ధనరాజ్‌ (45), పరమేశ్వర్‌నాయక్‌ (50)లుఅక్కడిక్కడే మృతి చెందగా ఆర్టీసీ బస్సలుఓని మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుల్లో ఒకరైన పరమేశ్వర నాయక్‌ కారవార పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐ. 

స్థానికుల ప్రేక్షకపాత్ర  
తీవ్రంగా గాయపడ్డ 15 మందిని ఆసుపత్రికి తరలించిన కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటన జరిగి సహాయం కోసం క్షతగాత్రులు ఆర్తనాదాలు చేస్తున్నా స్థానికులు, ఇతర వాహనదారులు నిలబడి చోద్యం చూస్తుండడం గమనార్హం. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న శిర గ్రామీణ సీఐ సుదర్శన్‌ జనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే సహాయం చేయకుండా చోద్యం చూస్తున్న మీరు అసలు మనుషులేనా?, మీలో మానవత్వం లేదా? అని నిలదీశారు. పోలీసులతో పాటు స్థానికులు, తోటి వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని తుమకూరు ఆస్పత్రికి మార్చారు. శిర డీఎస్పీ వెంకటేశ్‌ నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు