తొలిబండికి ప్రమాదం

29 Aug, 2019 10:03 IST|Sakshi

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

వెంకటాచలం మండలంలో ఘటన

పెయింట్‌ పనిచేసే యువకుడి మృతి

పదిమందికి గాయాలు వారంతా కూలీలే.. 

సాక్షి, వెంకటాచలం(నెల్లూరు) : ఆర్టీసీ బస్సును వెనుకనుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు మృతిచెందగా, మరో పదిమంది గాయపడ్డారు. మండలంలోని చెముడుగుంట పంచాయతీ పవన్‌కాలనీ వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఈదగాలి గ్రామం నుంచి తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు నెల్లూరుకు బయలుదేరింది.

జిల్లా కేంద్రానికి వెళ్లే మొదటి బస్సు కావడంతో కూలి పనులకు వెళ్లేవారు, విద్యార్థులతో కిక్కిరిసింది. ఈక్రమంలో పవన్‌కాలనీ సమీపానికి చేరుకోగానే వెనుకనుంచి లారీ ఆర్టీసీ బస్సును ఢీకొంది. బస్సు డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో జాతీయ రహదారి నుంచి కిందకు దిగి 50 మీటర్ల దూరం వెళ్లి మురిగుకాలువ వద్ద ఆగిపోయింది. బస్సు వెనుకభాగం పూర్తిగా దెబ్బతినడంతో వెనుక కూర్చున్న బుజబుజనెల్లూరుకు చెందిన మోపూరు శీనయ్య (20), ఈదగాలి గ్రామానికి చెందిన వలిపి చెంచయ్యలు ఇరుక్కుపోయారు. ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ కిందకు దిగేశారు. 

స్థానికుల సాయం
ప్రమాణికుల కేకలు విన్న పవన్‌కాలనీ వాసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శీనయ్య, చెంచయ్యలను స్థానికులు, ఇతర ప్రయాణికుల కష్టపడి బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది గాయపడగా క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ ఈఎంటీ శ్రీనివాసులు, పైల్‌ట్‌ వినయ్‌లు చికిత్స నిమిత్తం నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన మోపూరు శీనయ్య చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఈదగాలి గ్రామానికి చెందిన పెంచలయ్య, ఇడిమేపల్లి గ్రామానికి చెందిన పోలమ్మ, విజయమ్మ, పావని, వెంకమ్మ, చిరంజీవి, రమణయ్య, నాగంబోట్లకండ్రిగకు చెందిన చంద్ర, చెంచమ్మలు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై షేక్‌ కరిముల్లా ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

పాపం శీనయ్య..
మృతుడు శీనయ్య స్వగ్రామం బుజబుజనెల్లూరు. పెయింట్‌ పనులు చేస్తుంటాడు. అతను ఈదగాలి గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. నాలుగునెలల కుమారుడు ఉన్నాడు. కాన్పు అనంతరం భార్య ఈదగాలిలో ఉంటోంది. దీంతో శీనయ్య అక్కడే ఉంటున్నాడు. పనికోసం నెల్లూరుకు వెళుతూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నడుము, కాళ్లు విరిగిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రికి వచ్చిన కొద్దిసేపటికే మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

మరిన్ని వార్తలు