సిరామిక్స్‌ వ్యాపారి ఆత్మహత్య

8 May, 2018 11:35 IST|Sakshi
భూపేంద్రకుమార్‌ జైన్‌ (ఫైల్‌)

వివరాలు వెల్లడించేందుకు నిరాకరించిన కుటుంబ సభ్యులు

మంచిర్యాలక్రైం : మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ సమీపంలో ఉన్న పద్మనాయక ఇండ్రస్ట్రీస్‌ (సిరామిక్స్‌) యజమాని ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో సిరామిక్స్‌ పరిశ్రమలో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. పద్మనాయక సిరామిక్స్‌ యజమాని భూపేంద్రకుమర్‌ జైన్‌ (72) సోమవారం తన నివాసంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంట్లో నుంచి మార్కెట్‌కు వెల్లిన భూపేంద్రకుమార్‌ 6గంటలకు ఇంటికి వచ్చి బెడ్‌రూంలో పడుకున్నాడు.

పడుకున్నాడనుకొని కుటుంబ సభ్యులంతా భయట కూర్చొని ఉన్నారు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి మంటలు, ఆరుపులు, పొగ రావడం గమనించిన  కుటుంబ సభ్యులు పరుగెత్తి చూడగా అప్పటికే ఆయన మంటల్లో ఆహుతయ్యాడు. పూర్తిగా కాలిపోయిన భూపేంద్రకుమార్‌పై నీటిని పోసి మంటలను ఆర్పివేశారు. భూపేంద్రకుమార్‌కు భార్య నిర్మల భూపేంద్రజైన్, కుమారుడు నితిన్‌కుమార్‌జైన్‌ ఉన్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.  

వ్యాపారంలో నష్టమా...!  

భూపేద్రకుమార్‌ మృతికిగల బలమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యులను విచారించగా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. కొంత కాలంగా సిరమిక్స్‌ వ్యాపారం సరిగా నడవడం లేదని, నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. భూపేంద్ర ఇప్పటికే చాలా వరకు అప్పుల పాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడించడంలో నిరాకరించడంతో పలు ఆరోపణలకు తావిస్తుంది. ఇంట్లో భూపేంద్రతో పాటు ఆయన సతిమణి నిర్మల బిజైన్‌ ఉంటుంది. కుమారుడు నితిన్‌ జైన్‌ బెంగళూర్‌లో ఉంటున్నాడు.  

20ఏళ్ల క్రితం ఇక్కడికి వలస... 

బెంగళూర్‌కు చెందిన భూపేంద్రకుమార్‌ జైన్‌ 1998లో మంచిర్యాలకు వలస వచ్చి ఏసీసీ ప్రాంతంలో పద్మనాయక సిరామిక్స్‌ కంపెనీని నెలకొల్పాడు. ఆయన వద్ద నాడు సుమారు రెండు వందల మంది  కార్మికులు పని చేసేది. రానురానూ వ్యాపారం మార్కెట్లో దివాలా తీయడంతో ప్రస్తుతం కార్మికుల సంఖ్య 50కి చేరింది.  భూపేంద్ర మృతి విషయం తెలుసుకున్న సిరామిక్స్‌ కార్మికులు ఆయన ఇంటికి తరలి వచ్చారు.   
 

మరిన్ని వార్తలు