సీరియల్‌ స్నాచర్‌..‘సినిమా’ కష్టాలు...

9 Feb, 2018 08:11 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ శ్రీనివాసరావు

2011లో నేరజీవితం ప్రారంభం

2014లో పదకొండు కేసుల్లో చిక్కి జైలుకు

పీడీ యాక్ట్‌ ప్రయోగించినా మారని తీరు

ఇటీవల మూడు కమిషనరేట్లలో పంజా

అరెస్టు చేసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి,సిటీబ్యూరో: మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడి సీరియల్‌ స్నాచర్‌గా మారిన ఘరానా దొంగ మీర్‌ అయ్యాన్‌ను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అతను తన ముఠా తో కలిసి రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరాడు. పదకొండు నేరాల్లో 430 గ్రాముల బంగారు ఆభరణాలు లాక్కుపోయినట్లు పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చైతన్యకుమార్‌తో కలిసి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

‘సినిమా’ కష్టాలు...
మహారాష్ట్రలోని జల్గాం ప్రాంతానికి చెందిన మీర్‌ అయాన్‌ అలీ ఖాన్‌ అలియాస్‌ అబ్దుల్లా పుట్టక ముందే తండ్రిని కోల్పోయాడు. తన తొమ్మిదో ఏట తల్లి సైతం అనారోగ్యంతో మరణించింది. దీంతో అయాన్‌ తన మేనత్త వద్దకు చేరాడు. ఆమె పెడుతున్న బాధలు భరించలేక ముంబై పారిపోయాడు. అక్కడి వీధుల్లో తిరుగుతున్న ఇతడిని గమనించిన స్థానికులు కొలాబా ప్రాంతంలోని యాంకరేజ్‌ ఆర్ఫనేజ్‌ హోమ్‌కు తరలించారు. అక్కడే ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో హోమ్‌ మూతపడటంతో మళ్ళీ రోడ్డునపడ్డ అయాన్‌ మార్బుల్‌ స్టోన్స్‌ పరిచే పని నేర్చుకున్నాడు. ఈ వృత్తినే జీవనాధారంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో 2010లో హైదరాబాద్‌ వచ్చాడు. 

జల్సాలకు అలవాటుపడి...
సిటీలో కొన్నాళ్ల పాటు ఆ పనే చేసిన అయాన్‌కు అలా వచ్చిన ఆదాయం సరిపోలేదు. జల్సాలకు అలవాటుపడటంతో ఖర్చులు పెరిగి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్న అయాన్‌ 2011లో సైదాబాద్‌ పరిధిలో తొలి స్నాచింగ్‌ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో చంచల్‌గూడ జైల్లో ఉండగా బోయిన్‌పల్లి నుంచి వాహన చోరీ కేసులో జైలుకు వచ్చిన తలాబ్‌కట్ట వాసి మహ్మద్‌ అహ్మద్‌ అలీతో పరిచయమైంది. చెరశాలలోనే జట్టు కట్టిన ఈ ద్వయం బయటకు వచ్చాక వరుసపెట్టి స్నాచింగ్స్‌ చేయడం మొదలెట్టింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి నగరంలో నివసిస్తున్న హరేందర్‌ సింగ్‌తోనూ అయాన్‌కు పరిచ యం కావడంతో అతడూ ఈ ముఠాలో చేరాడు. 

కలిసి రాని ‘11’...
నిత్యం బైక్‌ను డ్రైవ్‌ చేసే బాధ్యతలు నిర్వర్తించే అయాన్‌ వెనుక కూర్చుని స్నాచింగ్‌ చేయడానికి మాత్రం ఒకసారి అలీని మరోసారి సింగ్‌ను తీసుకువెళ్ళేవాడు. ఈ రకంగా ఈ త్రయం 2014–15ల్లో సంతోష్‌నగర్, కార్ఖానా, ముషీరాబాద్, చిలకలగూడ, మేడిపల్లి, చందానగర్, మీర్‌పేట, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, నల్లకుంట, టప్పాచబుత్ర పరిధిలో 11 నేరాలు చేసి పోలీసులకు చిక్కింది. ఈ కేసులకు సంబంధించి సంతోష్‌నగర్‌ పోలీసులు 2016లో అయాన్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. గతేడాది ఫిబ్రవరిలో జైలు నుంచి బయటకు వచ్చిన అయాన్‌ కొన్నాళ్ళు ఆటోడ్రైవర్‌గా పని చేశాడు. అలా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో మళ్ళీ పాతమిత్రులతో కలిసి స్నాచింగ్స్‌ ప్రారంభించాడు. గతేడాది మే నుంచి లంగర్‌హౌస్, ఉస్మానియా వర్శిటీ, అంబర్‌పేట, గాంధీనగర్, మలక్‌పేట, నార్సింగి, ఉప్పల్, మేడిపల్లి ఠాణాల పరిధుల్లో 11 నేరాలు చేశాడు. 2011లో తొలిసారి అరెస్టు అయిన అయాన్‌.... ఆపై రెండు దఫాల్లోనూ 11 చొప్పునే స్నాచింగ్‌ చేసి పోలీసులకు చిక్కాడు. 

ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ...
నిత్యం హిందీ పేపర్లు చదివే అయాన్‌కు పోలీసుల దర్యాప్తు తీరుపై అవగాహన ఉంది. అధికారులు ప్రధానంగా సీసీ కెమెరాల ఫీడ్‌ ఆధారంగా ముందుకు వెళ్తారనే విషయం తెలుసుకున్నాడు. దీంతో తొలి రెండు స్నాచింగ్స్‌ను స్నేహితుడి నుంచి అరువు తెచ్చుకున్న వాహనంపై తిరుగుతూ చేశాడు. ఆపై తానే ఓ సెకండ్‌హ్యాండ్‌ వాహనం ఖరీదు చేసుకున్నాడు. దానికి నకిలీ నెంబర్‌ ప్లేట్‌ తగిలించడంతో పాటు నిత్యం హెల్మెట్‌ ధరించేవాడు. వెనుక కూర్చునే అలీ, సింగ్‌లతో మాస్క్‌ వేయించేవాడు. చోరీలకు వినియోగించిన వాహనాన్ని సైతం తలాబ్‌కట్టలోని తన ఇంటి వరకు తీసుకువెళ్ళకుండా దూరంగా పార్క్‌ చేసేవాడు. ఈ హెల్మెట్‌ ధరించి టార్గెట్లను ఎంచుకునే నేపథ్యంలోనే రెండుసార్లు ‘తప్పు’లోకాలేశాడు. మీర్‌పేట పరిధిలో చేసిన రెండు స్నాచింగ్స్‌లోనూ మహిళల మెడలో పసుపు రంగులో ఉన్న నైలాన్‌ తాడును బంగారు పుస్తెలతాడుగా భావించి స్నాచింగ్‌ చేయించాడు. ఈ ఘటనల్లో పుస్తెలు మాత్రం బంగారంవి అతడికి దక్కాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నందుకే ఎనిమిది నెలల పాటు వరుసగా స్నాచింగ్స్‌ చేయగలిగాడు.  
వ్యూహాత్మకంగా వ్యవహరించిన

టాస్క్‌ఫోర్స్‌..
గతేడాది మే నుంచి వరుసపెట్టి పంజా విసురుతున్న ఈ ముఠా కదలికలను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జనవరిలో గుర్తించారు. తమ వాహనానికి నకిలీ నెంబర్‌ ప్లేట్‌ తగిలించినప్పటికీ నిత్యం ఒకే ప్లేట్‌ వాడటంతో పోలీసులకు ఆధారం చిక్కింది. మరోపక్క సీసీ కెమెరాల్లో రికార్డు అయిన కదలికల ఆధారంగా వీరు పాతబస్తీకి చెందిన వారుగా తేల్చారు. వీటి ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్‌ ప్రసాద్‌వర్మ, జి.వెంకట రామిరెడ్డి, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థాకుద్దీన్‌ తమ బృందాలతో కలిసి దాదాపు నెల రోజుల పాటు పాతబస్తీని జల్లెడపట్టారు. గురువారం వాహనంపై వస్తున్న అయాన్‌ను పట్టుకున్నారు. ఇతడి నుంచి 311 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ.1.25 లక్షల నగదు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం మలక్‌పేట పోలీసులకు అప్పగించారు.  

మరిన్ని వార్తలు