ఆ రోజు ఏం జరిగింది..?

12 May, 2018 08:43 IST|Sakshi
చమన్‌ మృతదేహం , చమన్‌ కారు డ్రైవర్‌ నూర్‌ మహమ్మద్‌ (ఫైల్‌), మృతదేహం, మహబూబ్‌ బాషా మృతదేహం

చమన్‌ది సహజమరణమేనా..?

నాలుగురోజుల్లోనే కారు డ్రైవర్‌ అనుమానాస్పద మృతి

మృతిపై బలపడుతున్న  అనుమానాలు  

జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చమన్‌ది సహజ మరణమేనా.? ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే ఆయన ఎందుకు హఠాన్మరణం చెందారు? గుండెపోటుతోనే మృతి చెందారా..? లేదా ఆరోజు ఏమైనా జరిగిందా? ఇటీవల చమన్‌ అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి. చమన్‌ మృతి చెందిన నాలుగురోజుల్లోనే ఆయన కారు డ్రైవర్‌ నూర్‌ మహ్మమద్‌(27) గురువారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనతో చమన్‌ మృతిపై అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.  

అనంతపురం టాస్క్‌ఫోర్సు: జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్, పరిటాల రవి ముఖ్య అనుచరుడు దూదేకుల చమన్‌ ఈనెల 7న హఠాన్మరణం చెందారు. పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల కుమార్తె స్నేహలత వివాహాన్ని అంతకు ముందురోజు వెంకటాపురంలో ఘనంగా జరిపించారు. మరుసటిరోజు వెంకటాపురానికి వెళ్లిన చమన్‌ హఠాన్మరణం చెందారు. మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే చమన్‌ అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నా... అధికారికంగా వెల్లడించలేదు. చమన్‌ మృతి చెందిన మరుసటి రోజు నుంచి టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

బలవంతంగా రాజీనామా..!
ముందుగా నిర్ణయించిన రెండున్నర సంవత్సరాల పదవీకాలం ముగిసినప్పటికీ చమన్‌ జెడ్పీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయకపోవడం...ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సెప్టెంబర్‌ 8న ఆయనతో చైర్మన్‌ పదవికి బలవంతంగా రాజీనామా చేయించారు. తర్వాత నామినేటెడ్‌ పదవి ఇస్తారని పుకార్లు వినిపించినా ఆ మేరకు చర్యలు లేవు.  టీడీపీకి కోసం, పరిటాల రవీంద్ర కోసం తన జీవితాన్నే త్యాగం చేసినా.. పార్టీ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో చమన్‌ తీవ్ర అసంతృప్తిలో ఉండిపోయారు. 

పార్టీ మారే యోచనలో ఉన్నట్లు చర్చ
పార్టీ తనను గుర్తించలేదని ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆపార్టీ వర్గాల్లోనే జోరుగా సాగింది. ప్రముఖ పార్టీ తరుఫున హిందూపురం ఎంపీ టికెట్‌ను ఆశించినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఈనెల 7న మంత్రి సునీత సమక్షంలో చర్చ జరిగినట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఒత్తిడి తెచ్చారని, చిన్నపాటి వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనైన ఆయన అస్వస్థతకు గురైనట్లు అనుమనాలు గుప్పుమంటున్నాయి. అయితే గతంలో ఒకసారి చమన్‌ గుండెపోటుకు గురయ్యారని, వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందువల్ల ఆయన గుండెపోటుతోనే హఠాన్మరణం చెందారని పేర్కొంటున్నారు.

చమన్‌ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి
చమన్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన కారుడ్రైవర్‌గా పనిచేసిన నూర్‌మహ్మద్‌ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నగరంలో బోయవీధికి చెందిన నూర్‌మహ్మద్‌ గత కొద్దికాలంగా చమన్‌కు కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన హఠాన్మరణం చెందిన రోజు కూడా నూర్‌ మహ్మదే కారు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిసింది. అతన్ని బుధవారం నుంచి పనిలోకి రావద్దన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే  గురువారం రాత్రి బత్తలపల్లివైపు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు.

అయితే మన్నీల సమీపంలోకి రాగానే  మహబూబ్‌ బాషా(45) అనే వ్యక్తి ఐచర్‌ వాహనం పంక్చర్‌ కాగా, ఆ డ్రైవర్‌ను మాట్లాడించేందుకు వెళ్తుండగానే... అనంతపురం నుంచి బత్తలపల్లి వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనం వీరిని ఢీ కొంది. ఈ ఘటనలో గుత్తి ఆర్‌ఎస్‌ ప్రాంతానికి చెందిన ఐచర్‌ డ్రైవర్‌ మహబూబ్‌ బాషా (47)తో పాటు జెడ్పీ మాజీ చైర్మన్‌ చమన్‌ డ్రైవర్‌ నూర్‌ మహమ్మద్‌ (27) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం నగరంలోని బోయవీధికి చెందిన నూర్‌ మహమ్మద్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఐచర్‌ వాహనం క్లీనర్‌ మహేష్‌ నాయుడు ఫిర్యాదు మేరకు పోసీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ అనుమానాలే..!
అయితే ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూర్‌మహ్మద్‌ హత్యకు కుట్ర జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతోనే చనిపోయాడని పేర్కొంటున్నారు. చమన్‌ మృతిపైనే అభిమానాలకు నెలకొన్న అనుమానాలు నివృత్తి కాకమునుపే ఆయన కారు డ్రైవర్‌ చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత టీడీపీ ముఖ్యనేతలపై ఉంది.

మరిన్ని వార్తలు