నకిలీ పాస్‌ పుస్తకాలు ఇస్తే పీడీయాక్ట్‌

12 May, 2018 08:43 IST|Sakshi
మహిళా రైతుకు చెక్కు అందజేస్తున్న మంత్రులు మహమూద్‌ అలీ, పోచారం తదితరులు

రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది కర్షకులకు లబ్ధి

ఆంధ్రాపాలనా అంధేరి పాలన అని విమర్శ

సాక్షి, యాదాద్రి : నకిలీ పాస్‌పుస్తకాలు, నకిలీ రిజిస్ట్రేషన్‌లు చేస్తే పీడీయాక్ట్‌ నమోదు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్‌ అలీ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి భువనగిరి మండలం హన్మాపురంలో జరిగిన రైతుబంధు పథకం సభలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద రైతు కావడం వల్లే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రాపరిపాలన అంతా అంధేరి పాలనగా సాగిందన్నారు. మన ముఖ్యమంత్రి రైతుల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ. 12వేల కోట్లు కేటాయించారన్నారు.

రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు చెక్కులు ఇస్తున్నామన్నారు. భూరికార్డుల ప్రక్షాళనను రెవెన్యూ సిబ్బంది 95 శాతం పూర్తి చేశారని అభినందించారు.100శాతం భూ వివాదాలు లేకుండా రికార్డుల ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ రైతులకు నీళ్లు, కరెంటు, పెట్టుబడి సాయం, పంటకు మద్దతు ధర ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతు సమన్వయ సమితి వేదికలకు రూ. 300ల కోట్లు కేటాయించామన్నారు. రూ.12 లక్షలతో ఒక మోడల్‌ రైతు వేదిక నిర్మిస్తామన్నారు. తెలంగాణ దేశంలోనే మోడల్‌రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. రైతు కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను తీరుస్తుంటే కాంగ్రెస్‌ వాళ్లు ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ, 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించబోతున్నామన్నారు. ఇంతవరకు పాలించిన ప్రధానులు, ముఖ్యమంత్రులు రైతుల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. లక్షల అప్పులు రైతులకు మిగిల్చారని ఆరోపించారు. హన్మాపురం గ్రామంలో 555 రైతులకు రూ. 45.18.085 లక్షలను రైతు బంధు ద్వారా ఇస్తున్నామన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుకేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి దశదిశను చూపించే రైతుబంధు  కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టారన్నారు. 58 లక్షల మంది రైతులకు మొదటి విడతలో రూ.5,700ల కోట్లు, రెండవ విడతలో నవంబర్‌ 18న రూ. 5,700ల కోట్లు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. రైతుల బీమాకోసం రూ. 500ల కోట్లు సీఎం కేటాయించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు.

రైతు బంధు చెక్కులు తీసుకున్న రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. తనకు వచ్చే రైతు బంధు చెక్కుల మొత్తాన్ని రైతు సమన్వయ సమితికి ఇచ్చేస్తానన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజీవ్‌ త్రివేది, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పార్థసారథి, భూరికార్డుల ప్రక్షాళన రాష్ట్ర  అధికారి వాకాటి కరుణ, కలెక్టర్‌ అనితారామచంద్రన్, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ కొలుపుల అమరేందర్‌తోపాటు గ్రంథాలయ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్, గ్రామ సర్పంచ్‌ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు