ఏటీఎంలో ఘరానా మోసం

28 Feb, 2018 11:45 IST|Sakshi
ఎస్‌ఐ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేస్తున్న బాధితుడు నాగేశ్వరరావు చేతిలో నిందితుడు పెట్టిన ఏటీఎం కార్డు ఇదే

సహకరించినట్టు నటించి కార్డు కొట్టేసిన నిందితుడు

మూడు ఏటీఎం కేంద్రాల నుంచి రూ.40వేలు డ్రా

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఏటీఎంల్లో మో సాలు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎంత ప్రచారం చేస్తున్నా ఖాతాదారులు మేల్కోవడం లేదు. మళ్లీ మళ్లీ మోసపోతునే ఉన్నా రు. తాజాగా గోపాలపట్నంలో మరో ఉదంతం వెలుగు చూసింది. బాజీజంక్షన్‌ ఎస్సీకాలనీకి చెందిన ఎం. నాగేశ్వరరావు డబ్బులు డ్రా చేసేందుకు ఓ ఏటీఎంకు వెళ్లారు. ఆయనకు కళ్లజోడు లేకపోవడంతో వెనక నిల్చున్న వ్యక్తిని సాయం కోరారు. పిన్‌ నంబర్‌ చెప్పి రూ.2వేలు డ్రా చేయాలంటూ ఏటీఎం కార్డు ఇచ్చారు. తిరిగి కార్డు తీసుకుని ఇంటికి వచ్చేశారు. మంగళవారం కూడా మరో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే పిన్‌ నంబర్‌ పని చేయలేదు. ఆరా తీస్తే ముందు రోజు సహకరించిన వ్యక్తి నుంచి తీసుకున్న ఏటీఎం కార్డు తనది కాదని తేలింది. దీంతో ఎస్‌బీఐ బ్రాంచి మేనేజర్‌ రామ్‌కుమార్‌ని సంప్రదించారు.

ఖాతా నంర్‌ ఆధారంగా నగదు వివరాలు పరిశీలిస్తే..నిందితుడు నగరంలోని మరో మూడు ఏటీఎంలలో తన కార్డుతో రూ.20వేలు, రూ.17వేలు, రూ.3వేలు చొప్పున మొత్తం రూ.40వేలు డ్రా చేసినట్టు తేలింది. వెంటనే నాగేశ్వరరావు ఖాతాను బ్లాక్‌ చేశారు. తన మనుమరాలి కోసం దాచిన పింఛను డబ్బులు ఇలా నష్టపోయానని నాగేశ్వరరావు ఎస్‌ఐ మహంతి శ్రీనివాస్‌కు ఫిర్యాదిచ్చారు. బాధితుడికి నిందితుడు ఇచ్చిన కార్డు కూడా మరొకరిదని తేలింది. ఆ ఏటీఎం కార్డుపై ఎన్‌.అప్పలనాయుడు అని ముద్రించి ఉంది. నిందితుడు ఘరానా మోసగాడే అయి ఉంటాడని పోలీసులు అనుమానించారు. కాగా, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు సిబ్బంది సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తే అనుమానించాల్సిందేనని, పిన్, ఓటీపీ చెప్పి మోసం చేస్తున్న సంఘటనలపై జాగ్రత్తగా ఉండాలని రామ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు