దిండుతో నొక్కి చంపేశారు!

15 Feb, 2019 02:56 IST|Sakshi

పథకం ప్రకారమే జయరామ్‌ హత్య 

రాకేష్‌కు సహకరించిన నరేష్, రౌడీషీటర్‌ విశాల్, వాచ్‌మన్‌ శ్రీనివాస్‌ 

రెండ్రోజులపాటు నిర్బంధం.. బాండ్‌ పేపర్లపై బలవంతపు సంతకాలు 

ఆస్తి కాజేయాలని కుట్ర.. వెల్లడించిన పోలీసులు 

రూ. 4.17 కోట్ల విషయంలో ఇప్పటి వరకు రాని స్పష్టత

7 గంటలపాటు శిఖా చౌదరి విచారణ  

తెరపైకి రాకేష్‌ బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు  

సాక్షి, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్‌ హత్య పక్కా పథకం ప్రకారం జరిగిందేనని పోలీసులు తేల్చారు. హత్యచేయాలన్న ఉద్దేశంతోనే ‘హనీ ట్రాప్‌’ద్వారా పిలిపించిన రాకేష్‌రెడ్డి తదితరులు కొన్ని బాండ్‌ పేపర్లపై సంతకాలు చేయించుకుని ఆపై దిండుతో ముఖంపై నొక్కి హతమార్చారని తెలిసింది. దాదాపు 11 మంది పోలీసులతో సంబంధాలు కలిగి ఉన్న రాకేష్‌రెడ్డి వారితో పాటు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అనేక మందిని బెదిరించి డబ్బు కాజేసినట్లు, మోసాలకు పాల్పడినట్లు తేలింది. గురువారం సికింద్రాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్‌ అనే బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, జయరామ్‌ హత్య కేసుకు సంబంధించి మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. గురువారం సాయంత్రానికి రాకేష్, శ్రీనివాస్‌లతో పాటు విశాల్, రౌడీషీటర్‌ నగేష్‌ల పాత్రలపై ఆధారాలు లభించాయని తెలిసింది. మరోపక్క ఈ కేసులో శిఖాచౌదరిని దాదాపు 7 గంటల పాటు విచారించిన పోలీసులు.. రాత్రి 8 గంటలకు ఆమెను విడిచిపెట్టారు. 

అసలు జయరాంకు డబ్బు ఇచ్చాడా? 
ఈ ఘటనకు ప్రధాన కారణం రాకేష్‌రెడ్డి, జయరామ్‌ మధ్య ఉన్న ఆర్ధిక వివాదాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తేల్చారు. 2016–18 మధ్య రాకేష్‌ పలు దఫాల్లో జయరామ్‌కు రూ.4.17 కోట్లు ఇచ్చాడని, ఇందులో రూ.80లక్షలు ఒకసారి, 40లక్షలను రెండుసార్లు ఆర్టీజీఎస్‌ ద్వారా బదిలీ చేశాడని వెల్లడించారు. ఇదే విషయాన్ని నిందితుల అరెస్టు నేపథ్యంలో విడుదల చేసి అధికారిక ప్రెస్‌నోట్‌లోనూ పొందుపరిచారు. అయితే కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయిన తర్వాత నిందితులను విచారిస్తున్న హైదరాబాద్‌ పోలీసులకు ఈ ఆర్థికలావాదేవీలకు సంబంధించి ఆధారాలేవీ లభించలేదు. దీంతో గురువారం శిఖా చౌదరిని సైతం పోలీసుస్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సైతం లభించకపోవడం, రాకేష్‌ సరైన వివరాలు వెల్లడించకపోవడంతో పోలీసులు జయరామ్‌ బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. వీటిలో కూడా ఎక్కడా ఆ స్థాయిలో లావాదేవీలు లేవని భావిస్తున్నారు. దీంతో హత్య వెనుక మరేదైనా కారణం ఉందా? లేక జయరాం ఆస్తిని కాజేయడానికి బెదిరిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

దిండుతో ముఖంపై ఒత్తి పెట్టడంతో! 
రాకేష్‌ రెడ్డి తదితరులు గత 31వ తేదీ ఆర్థిక లావాదేవీల విషయమై జయరామ్‌తో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో వీరు జయరామ్‌పై దాడి చేయడంతో ఆయన కూర్చున్న ప్రాంతంలోనే పడిపోయారు. అనంతరం దిండుతో జయరామ్‌ ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని శ్రీనివాస్‌ సాయంతో జయరామ్‌ కారులోకి మార్చి రాకేష్‌ ఒక్కడే దాదాపు 5గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ 11 మంది పోలీసులతో మాట్లాడాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం రాకేష్‌ ఇంట్లో క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ చేశారు. కస్టడీలో ఉన్న నిందితులతో పాటు కొత్తగా పట్టుకున్న వారినీ తీసుకువెళ్లి క్లూస్‌ టీమ్‌ సమక్షంలో దీన్ని చేపట్టారు. ఈ తతంగం దాదాపు 40 నిమిషాలు జరిగింది. మరోపక్క రాకేష్‌ రెడ్డి బ్యాంక్‌ అకౌంట్‌ను స్తంభింపజేసిన అధికారులు సెల్‌ఫోన్లు, రెండు కార్లను, ఇంటిని సైతం సీజ్‌ చేశారు. జయరామ్‌ హత్య కేసులో శిఖాచౌదరితోపాటు మరో నలుగురిని విచారించామని పోలీసులు తెలిపారు. జయరామ్‌ కంపెనీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నామని, కొన్ని పత్రాలు కూడా తెప్పించి పరిశీలించామన్నారు. నాలుగున్నర కోట్లు జయరామ్‌కి అప్పు ఇచ్చే స్థోమత రాకేశ్‌కు ఉందా? అన్న కోణంలోనూ విచారణ జరుగుతోందన్నారు. అవసరమైతే శిఖాచౌదరిని మరింత లోతుగా విచారిస్తామన్నారు. పలువురు పోలీసు అధికారులపై కూడా ఆరోపణలున్నాని వీటినీ పరిశీలిస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కోస్టల్‌ బ్యాంకు ఉద్యోగులను కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.

పథకం ప్రకారం రప్పించి, బంధించి..! 
ఏపీ పోలీసుల విచారణలో రాకేష్‌రెడ్డి ఈ హత్య జరిగిన తీరును వివరిస్తూ.. అనుకోని పరిస్థితుల్లో జరిగిన పెనుగులాటతో జయరామ్‌ చనిపోయాడని, తనతో పాటు తన వాచ్‌మన్‌ శ్రీనివాస్‌కు మాత్రమే ఇందు లో ప్రమేయం ఉందని చెప్పాడు. దీన్నే అధికారులు కూడా నిర్ధారించారు. అయితే తెలంగాణ విచారణలో అనేక కొత్త విషయా లు బయటకొస్తున్నాయి. జయరామ్‌ను ‘హనీ ట్రాప్‌’ చేయడం కోసం రాకేష్‌రెడ్డి తన స్నేహితుడైన జూనియర్‌ ఆర్టిస్ట్‌ సూర్యను వినియోగించుకున్నాడని వెల్లడైంది. అతడి తో గత నెల 29 రాత్రి జయరామ్‌కు ఫోన్‌ చేయించిన రాకేష్‌.. ఓ యువతి విషయం చర్చించేలా చేశాడు. దీంతో మరుసటి రోజు జయరామ్‌ స్వయంగా ఆ జూనియర్‌ ఆర్టిస్ట్‌ కు కాల్‌ చేశారు. దీంతో జయరాంను తీసు కుని తన ఇంటికి రావాల్సిందిగా ఆర్టిస్ట్‌కు రాకేశ్‌ సూచించాడు. జయరాంను ఇంటికి తీసుకొచ్చే సమయానికే.. రాకేష్‌ ఇంట్లో వాచ్‌మన్‌ శ్రీనివాస్‌తోపాటు ఎస్సార్‌నగర్‌ రౌడీషీటర్‌ నగేష్, విశాల్‌ అనే మరో వ్యక్తి ఉన్నారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ అక్కడ నుంచి వెళ్లిపోగా.. మిగిలిన వారు జయరామ్‌ను బలవంతంగా లోపలకు తీసుకువెళ్లారు. 30, 31 తేదీల్లో జయరామ్‌ను ఆ ఇంట్లోనే నిర్బంధించి డ బ్బు కోసం అనేక మందికి ఫోన్లు చేయిం చారు. బలవంతంగా 10 ఖాళీ బాండ్‌ పేపర్ల పై సంతకాలు చేయించుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల కోసం సిరిసిల్లకు చెందిన గడ్డం శ్రీను, అంజిరెడ్డి, చొక్కారామ్‌లు రాకేశ్‌ ఇంటికి వచ్చారు. అక్కడ వీరికి జయరామ్‌ తారసపడినా.. ఏమీ మాట్లాడలేదని తెలిసింది. పోలీసులు గురువారం సూర్యను అదుపులోకి తీసుకుని విచారించారు. 

మరిన్ని వార్తలు