‘ఢిల్లీ’ పెత్తనం కేంద్రానికే!

15 Feb, 2019 02:57 IST|Sakshi

అధికారాల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు 

సివిల్‌ సర్వీసెస్‌ అధికారులపై పీటముడి..విస్తృత బెంచ్‌కు బదిలీ

మిగిలిన అంశాలపై ఏకాభిప్రాయంతో తీర్పు 

విభేదాలుంటే ఎల్జీదే ఆఖరి మాటని స్పష్టీకరణ 

ప్యూన్‌ను కూడా నియమించుకోలేం: ఆప్‌  

న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం, దేశ రాజధాని అయిన ఢిల్లీలో అధికారాల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సివిల్‌ సర్వీసెస్‌ అధికారులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే దానిపై ఇద్దరు సభ్యుల ధర్మాసనం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో, ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ‘ఢిల్లీ వర్సెస్‌ కేంద్రం’గా ప్రాచుర్యం పొందిన ఈ వ్యవహారంపై జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఢిల్లీలో అధికారం చెలాయించడంపై కేంద్రం, ఆప్‌ సర్కారు మధ్య ఆరు అంశాలపై నెలకొన్న పోరుకు సంబంధించి బెంచ్‌ మిగిలిన ఐదింటిపై ఏకాభిప్రాయంతో తీర్పు చెప్పింది. మొత్తంగా చూస్తే, మెజారిటీ విషయాల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని నర్మగర్భంగా పేర్కొంది.

కేంద్రం నియమించిన అఖిల భారత సర్వీస్‌ అధికారులు ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని ఆప్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌ అయిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయాలతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం తరచూ విభేదిస్తోంది. తాజా తీర్పుపై ఆప్‌ నిరాశ వ్యక్తం చేస్తూ, కనీసం తన కార్యాలయంలో ప్యూన్‌ను నియమించుకునే అధికారం కూడా ముఖ్యమంత్రికి లేకుండా పోయిందని వాపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకమని, న్యాయపర చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు సుప్రీంకోర్టుపై అతిపెద్ద దాడితో సమానమని బీజేపీ అభివర్ణించింది.  

ఏసీబీ ఎల్జీకి..రెవెన్యూ వ్యవహారాలు ప్రభుత్వానికి 
అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) పరిధిలోనే పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, విచారణ కమిషన్ల నియామక అధికారాల్ని కూడా కేంద్రానికే కట్టబెట్టింది. ఇక రెవెన్యూ వ్యవహారాలను తేల్చేందుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ల నియామకం, విద్యుత్‌ బోర్డు లేదా కమిషన్‌ ఏర్పాటు అధికారం ఢిల్లీ ప్రజా ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. అఖిల భారత సర్వీసు అధికారులపై నియంత్రణ విషయంలోనే ఇద్దరు జడ్జీలు విభేదించారు. ఐఏఎస్, ఐపీఎస్‌ లాంటి అధికారులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ కరాఖండిగా చెప్పారు. ఈ విషయంలో జస్టిస్‌ సిక్రి కొంత భిన్నంగా స్పందించారు. జాయింట్‌ డైరెక్టర్‌ లేదా అంతకు పైహోదా అధికారుల నియామకం, బదిలీలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని తెలిపారు.

మిగిలిన బ్యూరోకాట్ల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని, ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే ఎల్జీ మాటే చెల్లుబాటవుతుందని అన్నారు. గ్రేడ్‌–3, గ్రేడ్‌–4 స్థాయి అధికారుల నియామకాలు, బదిలీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని సూచించారు. ఢిల్లీ ప్రభుత్వ పాలన సవ్యంగా సాగాలంటే కార్యదర్శులు, విభాగాధిపతుల నియామకాలు, బదిలీలను ఎల్జీనే చేపట్టాలని అన్నారు. ఢిల్లీ–అండమాన్‌ నికోబార్‌ దీవుల సివిల్‌ సర్వీస్, ఢిల్లీ–అండమాన్‌ నికోబార్‌ దీవుల పోలీస్‌ సర్వీస్‌ అధికారుల విషయంలో ఢిల్లీ కేబినెట్‌ ఓ నిర్ణయం తీసుకుని, ఆ దస్త్రాన్ని ఎల్జీకి పంపించాలని పేర్కొన్నారు. తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఎల్జీనే అని చెప్పారు. సివిల్‌ సర్వీ సెస్‌ అధికారులపై నియంత్రణ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరు జడ్జీలు ఈ అంశాన్ని విస్త్రృత ధర్మాసనానికి నివేదించారు. ఈ విషయంలో జస్టిస్‌ సిక్రి, జస్టిస్‌ భూషణ్‌ల అభిప్రాయాల్ని పరిశీలించి ప్రధాన న్యాయమూర్తి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేస్తారు. 

ఢిల్లీ ప్రజల కష్టాలు తీరవు

సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని అధికార ఆప్‌ పేర్కొంది. జడ్జీల విరుద్ధ అభిప్రాయాలతో ఢిల్లీ ప్రజల కష్టాలు కొనసాగుతాయని వ్యాఖ్యానించింది. ఆప్‌ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే అధికారుల్నే కేంద్రం నియమిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీర్పు ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రభుత్వం న్యాయపర చర్యలు ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. సుప్రీంకోర్టుపై కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు అత్యున్నత ధర్మాసనంపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉన్నాయని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ వేస్తామని బీజేపీ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు