చిన్ని తల్లిదండ్రుల డీఎన్‌ఏ నమూనా సేకరణ

20 Apr, 2018 13:49 IST|Sakshi
చిన్ని పోలికలు ఉన్న మృతదేహం అంతర్ చిత్రం మాకం చిన్ని (ఫైల్‌)

ఫలితంపై స్థానికులు, పోలీసుల్లో సర్వత్రా టెన్షన్‌

సూరత్‌ చేరిన మరో పోలీసు బృందం 

మార్కాపురం : గుజరాత్‌లోని పాండిచేరా పోలీసుస్టేషన్‌ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందిన చిన్నారి డీఎన్‌ఏ (రక్త నమూనాలు), గతేడాది అక్టోబర్‌లో తప్పిపోయిన పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన మాకం చిన్ని తండ్రి అబ్రహం రక్తనమూనాలను సూరత్‌ పోలీసులు సేకరించి ఫలితం కోసం ల్యాబ్‌కు పంపారు. దీంతో సర్వత్రా, అటు గుజరాత్‌ పోలీసులు, ఇటు మార్కాపురం పోలీసులు, ప్రజలు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.

మూడు, నాలుగు రోజుల్లో ఫలితాలు వచ్చేలా గుజరాత్‌ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసును ఇటు ప్రకాశం పోలీసులు, అటు సూరత్‌ కమిషనర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతేడాది అక్టోబర్‌ 10న మార్కాపురం ఎస్సీ హాస్టల్‌లో చదుకుంటూ అదృశ్యమైన మాకం చిన్ని కేసు మిస్టరీగా మారింది. సూరత్‌ సమీపంలో దొరికిన చిన్నారి మృతదేహం పోలికలు, మాకం చిన్ని పోలికలు ఒకే విధంగా ఉండటంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది.

మృతదేహం ఒంటిపై అక్కడక్కడా గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మాకం చిన్ని తల్లిదండ్రులను మార్కాపురం పోలీసులు సూరత్‌ తీసుకెళ్లారు. కుమార్తె పోలికలు సంఘటన స్థలంలో ఉన్న మృతదేహం పోలికలు దగ్గరగా ఉన్నా ఎడమ మోచేతి కింద పుట్టుమచ్చ లేదని, తన కుమార్తె కాకపోవచ్చని అబ్రహం అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఫింగర్‌ ప్రింట్స్‌ కూడా ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌లో మ్యాచ్‌ కాకపోవడంతో డీఎన్‌ఏ పరీక్షలకు సిద్ధమయ్యారు.

బుధవారం చిన్ని తండ్రి అబ్రహం రక్తనమూనా సేకరించగా గురువారం రాత్రి తల్లి విశ్రాంతమ్మ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలిసింది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు. డీఎన్‌ఏ పరీక్షలో మృతురాలిది, తల్లిదండ్రుల రక్తనమూనాలు మ్యాచ్‌ అయితే మాకం చిన్నిగా పోలీసులు భావిస్తారు. అలా కాకుంటే చిన్ని ఎక్కడుందనేది పోలీసులకు సవాల్‌గా మారనుంది. డీఎన్‌ఏ పరీక్షల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

మరిన్ని వార్తలు