డీఎంను బతికించిన భార్య ఫోన్‌ కాల్‌

11 Apr, 2018 07:05 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎం ఎన్‌.కృష్ణారెడ్డి

సూసైడ్‌ నోట్‌ అదృశ్యం

పూర్తి స్థాయి విచారణకు పలువురి డిమాండ్‌   

సాక్షి, నెల్లూరు(పొగతోట): పౌరసరఫరాల సంస్థ డీఎం ఎన్‌.కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం జిల్లాలో సంచలనంగా మారింది. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. అధికార పార్టీ నాయకులు, జిల్లా అధికారులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఒత్తిళ్ల కారణంగా డీఎం ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని బీజేపీ, ఇతర పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉన్నతాధికారుల బెదిరింపులు
ఉన్నతాధికారులు డీఎంను బెదిరించినట్లు సమాచారం. బీపీటీ ధాన్యం వ్యవహారంలో ‘మంత్రితో చెప్పిన మాటలు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించాలి, సాయంత్రానికి నీవు ఔట్, పెన్షన్‌ కుడా రానివ్వను, నీపై కేసులు పెటిస్తా’ అని రాష్ట్ర అధికారి డీఎంను ఫోన్‌లో బెదిరించినట్లు తెలిసింది. అధికారపార్టీ నాయకులు, పలువురు రాష్ట్ర, జిల్లా అధికారులు భయాందోళనకు గురిచేయడంతో డీఎం ఆత్మహత్యకు పూనుకున్నారు. కాగా ఆయన ఆత్మహత్యకు గల కారణాలను, అధికారులు పేర్లను సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు సమాచారం. అయితే దీనిని అదృశ్యం చేశారు.

మీ వల్లనే..
డీఎంను పరామర్శించేందుకు కొందరు అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో ఆయన భార్య వారిని నిలదీసినట్లు తెలిసింది. మీరు చిన్న వయసులో ఉన్నారు.. ఆయన వయసు పెద్దది. ఇటువంటి ఒత్తిళ్లను ఏవిధంగా తట్టుకోగలడని ఆమె ప్రశ్నించారు. మీ ఒత్తిళ్ల వల్లనే ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతిచెంది ఉంటే ఆయన్ను తిరిగి తీసుకురాగలరా అని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీఎం నాన్‌ రెవెన్యూ అధికారి. రెవెన్యూ అధికారి అయిఉంటే ఇప్పటికే ఉద్యోగులు విధులు బహిస్కరించి ధర్నాలు, నిరసనలు మొదలుపెట్టి ఉండేవారు. గతంలో పౌరసరఫరాల శాఖలో సీఎస్‌ డీటీ, ఏఎస్‌ఓ పోస్ట్‌లంటే ఉద్యోగులు క్యూ కట్టేవారు. రూ.లక్షలు చెల్లించి పోస్ట్‌లను దక్కించుకునే వారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు డ్యూటీలంటే సీఎస్‌ డీటీలు భయభ్రాంతులకు గురవుతున్నారు.  

ఏం జరిగిందంటే..
సోమవారం ధాన్యం కొనుగోలుపై మంత్రి సోమిరెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హోస్‌లో సమావేశం పెట్టారు. ఇందులో  బీపీటీ సేకరించాలని అధికార పార్టీ నాయకులు, కొనుగోలు చేస్తే ఏసీబీకి పట్టిస్తాం, పింఛన్‌ రానివ్వకుండా చేస్తామని ఉన్నతాధికారులు బెదిరించడంతో మనస్తాపానికి గురైన డీఎం ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. అనంతరం ఉదయం కార్యాలయానికి వచ్చారు. ఇన్‌చార్జి డీఎస్‌ఓ ఎంవీ రమణకి ఫోన్‌ చేసి అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. ఆయన తాను మాట్లాతానని చెప్పినా వినకుండా కృష్ణారెడ్డి ఫోన్‌ పెట్టేశారు. అనంతరం డీఎం భార్యకు ఫోన్‌ చేసి టెన్షన్లు అధికంగా ఉన్నాయి, ఆత్మహత్య చేసుకుంటున్నాను, పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. ఆమె వెంటనే కార్యాలయ ఉద్యోగులకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. ఉద్యోగులు డీఎం గదిలోకి చేరుకునే సరికి ఆయన ఉరి వేసుకుని ఉన్నారు. వారు ఆయన్ను రక్షించారు. 

మరిన్ని వార్తలు