చేనేతకు చేయూత | Sakshi
Sakshi News home page

చేనేతకు చేయూత

Published Wed, Apr 11 2018 7:08 AM

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

‘నూలు తెచ్చి.. గంజిపెట్టి.. పొడుగు పట్టి.. అచ్చు అతికి.. మొల కట్టి.. మగ్గం మీదకు ఎక్కించి.. చిలప ఒడికి.. కండెలు చుట్టి.. నాడిని అటూ ఇటూ పరిగెత్తించేలా కుచ్చు లాగుతూ.. దండెం కదుపుతూ.. పాముకోళ్లు తొక్కుతూ రెక్కలు ముక్కలయ్యేలా, కాళ్లు కండెలు కట్టేలా భార్యాభర్తలం రోజంతా శ్రమిస్తే వచ్చే మజూరీ గిట్టుబాటు కావడంలేదన్నా..’ అంటూ జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట చేనేత కార్మికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని, ఆకలి బాధలు తీరుస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

సాక్షి, అమరావతి బ్యూరో:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 133వ రోజు మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో పాదయాత్ర సాగింది. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. కార్మికులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి చేనేత కార్మికుడికీ మేలు జరిగేలా చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి కార్మికుడికీ నెలకు రూ.2 వేల సబ్సిడీ ఇచ్చి, అన్నివిధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ‘మీ జీవితాలు మెరుగు పడ్డాయా?’ అని జననేత ప్రశ్నించినప్పుడు, ‘లేదు... లేదు..’ అంటూ చేనేత కార్మికులు బదులి చ్చారు. నేతన్నల ఆకలి బాధలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయని తాను గతంలో అసెంబ్లీలో గట్టిగా అడిగినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.

తాను కార్మికుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తే, బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో హేళన చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులు కనిపిస్తే బుట్టలు నేస్తున్నట్లు, గౌడ సోదరులు కనిపిస్తే తాడు మెడలో వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇస్తారని వైఎస్‌ జగన్‌ విమర్శించగా, ‘ఫోజులు తప్ప చంద్రబాబు చేసేది ఏమీ ఉండదు’ అంటూ నేత కార్మికులు చర్చించుకున్నారు. ‘చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు కదా. ఏ ఒక్కరికైనా అప్పు మాఫీ అయ్యిందా?’ అని జగన్‌ ప్రశ్నించగా, ‘ఆ హామీ పచ్చి మోసం. బడ్జెట్‌లో ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ నాలుగేళ్లల్లో రూ.183 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు’ అంటూ చేనేత కార్మికులు గణాంకాలు వెల్లడించారు. ‘జిల్లాకు చేనేత పార్కు ఎక్కడైనా కనిపించిందా? చేతులెత్తి చెప్పాలి’ అంటూ జగన్‌ ప్రశ్నించగా, ‘లేదు.. లేదు..’ అంటూ కార్మికులు బదులిచ్చారు. చేనేత కార్మికులు ప్రస్తావించిన సమస్యలను సావధానంగా ఆలకించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాటన్నింటిని పరిష్కరిస్తానని, నవరత్నాల ద్వారా రాజన్న పాలనను తీసుకొస్తామని భరోసా కల్పించారు.

తరలివచ్చిన ప్రజానీకం
పెదవడ్లపూడి బస నుంచి మంగళవారం ఉదయం ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఆత్మకూరు, తెనాలి ఫ్లైఓవర్, మంగళగిరి పాతబస్టాండ్, హీరా పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్‌ మీదుగా అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు 9.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అడుగడుగునా జననేత జగన్‌కు ప్రజలు సాదర స్వాగతం పలికారు. ఉదయాన్నే బస ప్రాంతానికి ప్రజలు తరలి వచ్చి తమ అభిమాన నేతతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సంబరపడిపోయారు. దారిలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆత్మకూరులో గద్దె రామస్వామి, భార్య రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లి వారి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల స్థితిగతులను నేరుగా పరిశీలించారు. అద్దకం కార్మికులకు ఏం చేస్తే వారి పరిస్థితి మెరుగుపడుతుందో ఆరా తీశారు. రత్నాల చెరువు ప్రాంతంలో చిన్నపాటి వర్షం వచ్చినా పనిచేసుకోలేని దుస్థితి నెలకొందని పలువురు కార్మికులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరి పట్టణంలో మండుటెండను సైతం లెక్క చేయకుండా అశేష జనవాహిని జగన్‌వెంట నడిచింది. ప్రతి ఒక్కరినీ చెరగని చిరునవ్వుతో జగన్‌ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఓపిగ్గా వింటూ ముందుకు కదిలారు. ఆత్మకూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు ఆధ్వర్యంలో పట్టు వస్త్రం తయారు చేసి జననేతకు బహూకరించారు. 

వెల్లువెత్తిన సమస్యలు
ప్రజా సంకల్పయాత్ర పొడవునా జననేత జగన్‌కు ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పంచాయతీరాజ్‌ పరిధిలో పీడబ్ల్యూడీ పథకం కింద విధులు నిర్వహించే తమకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించడం లేదని అందుగల మంజు, ప్రవీణ్‌కుమార్‌ వినతి పత్రం సమర్పిం చారు. 2006లో వైఎస్సార్‌ నగర్‌ పేరుతో ఆత్మకూరు పరిధిలో 350 కుటుంబాల వారం గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని, డ్రెయిన్లు, మంచినీటి వసతి కల్పించలేదని హైమావతి, భరణి ఆవేదన వ్యక్తం చేశారు.

పాదయాత్రలో పాల్గొన్న నాయకులు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి బి.సురేంద్ర, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పెడన మున్సిపల్‌ చైర్మన్‌ ఆనందప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ సంస్థల సలహాదారు దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్‌
ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పెదిరెడ్డి మిధున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డితో జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రం గర్వపడేలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని అభినందించారు. ‘మీ నిబద్ధత, అంకిత భావం చూసి రాష్ట్ర ప్రజలు గర్విస్తున్నారు’ అంటూ మెచ్చుకున్నారు. పోరాటాన్ని ఆపేది లేదని మిధున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి స్పష్టంచేశారు.

Advertisement
Advertisement