డెలివరీకి వచ్చి దొరికేశాడు

3 Apr, 2019 07:15 IST|Sakshi

డ్రగ్‌ పెడ్లర్‌ను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: గోవా నుంచి మాదక ద్రవ్యాన్ని డెలివరీ చేసేందుకు నగరానికి వచ్చిన డ్రగ్స్‌ పెడ్లర్‌ను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. అతడి నుంచి 5 గ్రాముల కోకైన్‌ స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రలోని కళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన ముసిహుబుద్దీన్‌ బర్కత్‌ అలీ అన్సారీ అలియాస్‌ సమీర్‌ వృత్తిరీత్యా ఎయిర్‌ కండిషన్‌ మెకానిక్‌గా పని చేసేవాడు. వృత్తిలో భాగంగా గోవాకు వెళ్లిన సమీర్‌ అక్కడే స్ధిరపడ్డాడు. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల క్రితం అతడికి గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారం చేసే స్మగ్లర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి నుంచి హోల్‌సేల్‌గా డ్రగ్స్‌ ఖరీదు చేసే అతను ప్రధానంగా విదేశీయులకు వాటిని విక్రయించేవాడు.

కలింగూడ్‌ బీచ్‌ కేంద్రంగా ఈ దందా నిర్వహించేవాడు. కొన్నాళ్ల క్రితం విహారయాత్ర కోసం గోవా వెళ్లిన హైదరాబాదీయులతో అతడికి పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో సమీర్‌ డ్రగ్స్‌ వ్యాపారం చేస్తాడని తెలుసుకున్న నగరవాసులు అతడి ఫోన్‌ నంబర్‌ తీసుకున్నారు. ఇటీవల సమీర్‌కు కాల్‌ చేసిన సదరు వ్యక్తులు కొకైన్‌ కావాలంటూ ఆర్డర్‌ ఇచ్చారు. దీంతో 5 గ్రాముల కోకైన్‌తో వచ్చిన సమీర్‌ టోలిచౌకి పరిధిలో సంచరిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం దాడి చేసి సమీర్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి కొకైన్‌ స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోటోపిక్‌ సబ్‌స్టాన్షియస్‌ (ఎన్డీపీఎస్‌) యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ చట్ట ప్రకారం ఓ వ్యక్తి దగ్గర మాదకద్రవ్యం ఉండే మాత్రమే అతడిపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే సమీర్‌తో ఈ డ్రగ్‌ తెప్పించుకున్న వారిని పట్టుకోవాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మరిన్ని వార్తలు