పాపం! పారిశుధ్య కార్మికులు

8 Jun, 2018 08:38 IST|Sakshi
బాధిత దంపతులను ఓదారుస్తున్న ఇజ్రాయేల్‌

మద్యం మత్తులో కానిస్టేబుల్‌ వీరంగం

అదేమని ప్రశ్నించిన భర్తపై దాడి

ఒకరు అరెస్ట్‌–కానిస్టేబుల్‌ను కాపాడేయత్నం

అసలే పేదవారు. ఆపై.. తెలుగువారైన పారిశుధ్య కార్మికులు. అలాగే అసలే పోలీసు, ఆపై స్నేహితులతో కలసి మద్యం మత్తులో జోగుతున్నాడు. సొంతూరును వదిలిపెట్టి పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వచ్చిన యువ దంపతులపై ఈ కామాంధుల కన్నుపడింది. సామూహిక అత్యాచారానికి పాల్పడబోతున్న వారి నుంచి అదృష్టవశాత్తు భార్య తప్పించుకున్నా, భర్త మాత్రం దుర్మార్గుల దాష్టీకానికి గురై గాయపడ్డాడు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ముఖ్యంగా చెన్నై కార్పొరేషన్‌లో పనిచేసే పారిశుధ్య కార్మికుల్లో 90 శాతం తెలుగువారే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయినా పారిశుధ్య పనుల్లో ఇమిడిపోయిన తెలుగు కుటుంబాలు మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి వలసపోకుండా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌–కర్ణాటక సరిహద్దులోని గుల్బర్గాకు చెందిన అనే తెలుగు యువ దంపతులకు నిండా 20 ఏళ్లు కూడా ఉండవు. చెన్నై శివారు పోరూరులోని ఒక కాలువ ఒడ్డున నివసిస్తున్న సుమారు పది పారిశుధ్య కార్మిక కుటుంబాలతో ఆ యువ దంపతులు కలసి జీవిస్తున్నారు. గత కొంతకాలంగా చెన్నై కార్పొరేషన్‌లో ఆ దంపతులిద్దరూ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్‌ వీరిద్దరికీ గిండీ కంటోన్మెంటు సెంట్‌థామస్‌ మౌంట్‌ ప్రాంతంలో పారిశుధ్య పనుల బాధ్యతలను అప్పగించింది.

మంగళవారం తెల్లవారుజామున యథావిధిగా తమ విధులపరిధిలోని ప్రాంతంలో పారిశుధ్య పనులు నిర్వహిస్తుండగా ఒంటరిగా చెత్తను ఊడుస్తున్న కార్మికురాలిపై మద్యం మత్తులో జోగుతున్న మహేష్‌ అనే కానిస్టేబుల్‌ కన్నేశాడు. తన ఇంటిలోని చెత్తను తీసుకెళ్లాలని పిలిచాడు. అయితే ఆమెకు తమిళం అర్థం కాకపోవడంతో అయోమయంగా చూసింది. దీంతో ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న మహేష్‌ అతని స్నేహితుడు ఆర్ముగం మరో ఇద్దరు కలిసి అత్యాచారయత్నం చేశారు. అయితే వారి కబంధ హస్తాల నుంచి తప్పించుకుని పారిపోయిన ఆమె అదే ప్రాంతంలో పారిశుధ్య పనులను నిర్వహిస్తున్న భర్త వద్దకు వెళ్లి భోరుమంది. వెంటనే ఆమె భర్త సదరు వ్యక్తుల వద్దకు వెళ్లి నిలదీయగా భారీ దేహదారుఢ్యంతో ఉన్న వారు ఎదురుదాడికి దిగారు. చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టారు. జనసంచారం పెరగడంతో ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్లిపోయారు.

సంఘం నేతల అండ
ఈ సమాచారం ఆనోటా ఈనోటా ప్రచారమై తమిళనాడు పారిశుధ్య కార్మికుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, టామ్స్‌ అధ్యక్షుడు, తెలుగు ప్రముఖుడైన గొల్లపల్లి ఇజ్రాయేల్‌ దృష్టికి వచ్చింది. సంఘం అధ్యక్షుడు నారాయణస్వామి, సంఘం కంటోన్మెంటు ఇన్‌చార్జ్‌ జ్యోతికుమార్, ఏపీకి చెందిన ఎన్‌జీవోలు హరిప్రసాద్, నూనె ప్రసాద్‌లను వెంటపెట్టుకుని బాధిత దంపతులను కలసి ఓదార్చారు. తెలుగువారికి అండగా ఇక్కడ అనేక సంఘాలున్నాయని వారికి ధైర్యం చెప్పి పరంగిమలై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. అయితే పోలీసులు నిందితుల్లో ఒకడైన ఆర్ముగంను మాత్రమే అరెస్ట్‌ చేసి కానిస్టేబుల్‌ మహేష్‌ను, మిగిలిన ఇద్దరిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. శుక్రవారం మరిన్ని తెలుగు సంఘాలతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కానిస్టేబుల్‌ మహేష్‌ తదితరులను కూడా అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేయబోతున్నట్లు ఇజ్రాయెల్‌ సాక్షికి తెలిపారు. 

మరిన్ని వార్తలు