15వ ఏట నుంచే నేరబాట

13 Apr, 2020 09:28 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న నగర సీపీ అంజనీకుమార్‌

50కి పైగా నేరాలు చేసిన మహేష్‌ 

వారంలోనే వరుసగా నాలుగు చోరీలు  

పాత నేరస్తుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ 

రూ.15 లక్షల విలువైన సొత్తు స్వాధీనం 

సాక్షి, హైదరాబాద్‌: తన పదిహేనో ఏట నుంచే నేరాలు చేయడం ప్రారంభించిన మహేష్‌ మైనర్‌గానే అనేకసార్లు అరెస్టు అయ్యాడు. ఓ కేసులో శిక్ష పడటంతో స్పెషల్‌ హోమ్‌కు తరలించారు. శిక్షాకాలం పూర్తికాకుండానే తప్పించుకుని పారిపోయాడు. ఆ వెంటనే మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించి వారం రోజుల్లో నాలుగు చోట్ల పంజా విసిరాడు. ఈలోపు మైనార్టీ సైతం పూర్తయి మేజర్‌గా మారిన ఇతగాడిని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ నేరగాడి నుంచి రూ.15 లక్షల విలువైన సొత్తు, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శనివారం వెల్లడించారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్‌ మహేష్‌ (19) తన 15వ ఏట నుంచే నేరబాటపట్టాడు. రాజధానితో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో తొలినాళ్ళల్లో వాహన చోరీలు చేసిన ఇతగాడు ఆపై ఇళ్లల్లో దొంగతనాలు మొదలెట్టాడు. ఇప్పటి వరకు మహేష్‌పై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. మూడేళ్ల క్రితం మైనర్‌గా ఉన్న మహేష్‌ను పట్టుకున్న వనస్థలిపురం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి మూడేళ్ల శిక్ష విధించడంతో గాజులరామారంలోని గవర్నమెంట్‌ స్పెషల్‌ హోమ్‌ ఫర్‌ బాయ్స్‌లో ఉంచారు. అక్కడి అధికారులు మహేష్‌ సహా మరికొందరికి వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పించారు. అందులో భాగంగా ఇతగాడిని గచ్చిబౌలిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో (ఎన్‌ఐసీ) చేర్పించారు.

రెండేళ్ల ఎనిమిది నెలల శిక్షకాలం పూర్తి చేసుకున్న మహేష్‌ గత నెల్లో ఎన్‌ఐసీ నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించి  గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది. లాక్‌డౌన్‌కు వారం రోజుల ముందు ఇలా బయటకు వచ్చిన మహేష్‌కు మైనార్టీ సైతం తీరింది. అప్పటి నుంచి లాక్‌డౌన్‌ మొదలయ్యే వరకు కంచన్‌బాగ్, సరూర్‌నగర్, నల్లగొండ, మలక్‌పేటల్లో నాలుగు నేరాలు చేశాడు. ఇందులో రెండు వాహనచోరీలు కాగా, మరో రెండు ఇళ్లల్లో దొంగతనాలు. ఇతడి ఆచూకీ కోసం ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. కంచన్‌బాగ్‌ పరిధిలో శనివారం వాహన తనిఖీలు చేపడుతుండగా చోరీ వాహనంపై వచ్చిన ఇతగాడు చిక్కాడు. ఇతడి నుంచి రూ.15 లక్షలు విలువైన సొత్తు, వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. మహేష్‌ పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని నిర్ణయించినట్లు కొత్వాల్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.  

నడిరోడ్డు పైనే 
నగర పోలీసు కమిషనరేట్‌ చరిత్రలో తొలిసారిగా కమిషనర్‌ కార్యాలయం ముందున్న రోడ్డు విలేకరుల సమావేశానికి వేదికైంది. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసిన మహేష్‌ ప్రెస్‌మీట్‌తో పాటు నటుడు విజయ్‌ దేవరకొండ, దర్శకుడు శంకర్‌లు అతిథులుగా హాజరైన ఫేస్‌షీల్డ్స్‌ పంపిణీ కార్యక్రమం సైతం కమిషనర్‌ కార్యాలయం ముందున్న రోడ్డుపై జరిగాయి. కరోనా ప్రభావం నేపథ్యంలో కమిషనరేట్‌తో పాటు కాన్పరెన్స్‌ హాల్‌లోకి రాకపోకలు నియంత్రించిన అధికారులు ఈ రకంగా రోడ్డుపై తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. విలేకరులు సహా అంతా స్టేజ్‌ మీద, దాని పక్క, చెట్ల కింద నిల్చునే ఉన్నారు.  

మరిన్ని వార్తలు