టీమ్‌మేట్‌ రూమ్‌లో రేప్‌.. క్రికెటర్‌కు జైలుశిక్ష

1 May, 2019 11:32 IST|Sakshi
సహచరితో కోర్టుకు వచ్చిన హెప్‌బర్న్‌

లండన్‌: టీమ్‌మేట్‌ బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడి చేసిన క్రికెటర్‌కు బ్రిటిష్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇంగ్లండ్‌ కౌంటీ జట్టు వర్సెస్టర్‌ మాజీ ఆల్‌రౌండర్‌, ఆస్ట్రేలియా సంతతికి చెందిన 23 ఏళ్ల అలెక్స్‌ హెప్‌బర్న్‌కు ఈ మేరకు శిక్ష విధించింది. ఎక్కువ మంది మగువలతో శృంగారం చేయాలంటూ ఓ వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టి.. పోటీని సృష్టించిన హెప్‌బర్న్‌ 2017 ఏప్రిల్‌లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టినందుకు వర్సెస్టర్‌ జట్టు నుంచి అతన్ని తొలగించారు.

2017లో వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టిన తొలిరాత్రే  వర్సెస్టర్‌లోని హెప్‌బర్న్‌ ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగింది. హెప్‌బర్న్‌ జట్టు సహచరుడైన జోయి క్లార్క్‌ ఓ నైట్‌క్లబ్‌లో తనకు పరిచయం అయ్యాడని, అతనితో పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నానని బాధితురాలు కోర్టుకు తెలిపింది. ఆ రోజు తెల్లవారుజామున అతను బెడ్‌రూమ్‌ నుంచి వెళ్లిపోయిన అనంతరం హెప్‌బర్న్‌ రహస్యంగా గదిలోకి చొరబడ్డాడని, ఇంకా నిద్రిస్తున్న తనపై అతను లైంగిక చర్యకు ఒడిగట్టాడని,  క్లార్క్‌గా భావించి అతనితో శృంగారంలో పాల్గొన్నానని బాధితురాలు పేర్కొంది. కానీ, అతను హెప్‌బర్న్‌ అని తెలియడంతో షాక్‌ తిన్నానని, అత్యంత క్రూరమైన నేరానికి హెప్‌బర్న్‌ ఒడిగట్టాడని ఆమె కోర్టుకు తెలిపింది.

ఈ కోర్టు విచారణ సందర్భంగా హెప్‌బర్న్‌ అహంకారపూరితమైన ధోరణిపై జడ్జి జిమ్‌ టిండల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత మూర్ఖంగా హెప్‌బర్న్‌, అతని జట్టు సహచరుడు శృంగార సంబంధిత గేమ్‌లో పాల్గొనడానికి అంగీకరించారని, ఇది కుర్రచేష్టగా మీరు భావించి ఉంటారని, కానీ, ఇది దారుణమైన సెక్సిజమేనని జడ్జి స్పష్టం చేశారు. ‘ఇది మహిళలను కించపరిచి.. లైంగిక దాడిని తక్కువ చేసి చూపడమే. దీనిని నువ్వు చాలా లైట్‌గా తీసుకున్నావు. రేప్‌ అంటే ఎంత తీవ్రమైనదో ఇప్పుడు నీకు తెలిసివస్తుంది’ అని హెప్‌బర్న్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘నీకు నువ్వు మహిళలకు దేవుడిచ్చిన కానుకగా భావించావు. బాధితురాలిని మాంసం ముద్దగానే నువ్వు చూశావు కానీ, గౌరవించదగ్గ  సాటి మనిషిగా నువ్వు పరిగణించలేదు’ అని జడ్జి వ్యాఖ్యానించారు.

బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి.. జరిగిన క్రూరమైన నేరం గురించి కోర్టుకు తెలిపిందని జడ్జి ప్రశంసించారు. హెప్‌బర్న్‌పై ఓరల్‌ రేప్‌ నేరాన్ని ధ్రువీకరించిన కోర్టు.. ఇతర రేప్‌ అభియోగాలను తొలగించింది. హెప్‌బర్న్‌ తరఫు లాయర్‌ మాట్లాడుతూ.. తన తప్పును గుర్తించి పశ్చాత్తాపాన్ని ప్రకటించారని తెలిపారు.

మరిన్ని వార్తలు