సైబర్‌ వలలో మరో ముగ్గురు

13 May, 2019 13:47 IST|Sakshi
సిండికేట్‌ బ్యాంకు నుంచి హెచ్‌డీఎఫ్‌కు నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టుగా మెసేజ్‌ ,నగదు పోయినట్లు వచ్చిన స్టేట్‌బ్యాంకు మెసేజ్‌ ఇదే

రూ. 1.13 లక్షలు దోచుకున్న సైబర్‌ మాయగాళ్లు

బాధితుల్లో పీహెచ్‌సీ ఏఎన్‌ఎం, హెల్త్‌ సూపర్‌వైజర్‌

పోలీసులను ఆశ్రయించిన వైనం

కాశీబుగ్గ: రాజాంలో ఉద్యోగులు సైబర్‌ మోసానికి బలైన విషయం మరవకముందే, తాజాగా పలాసలో మరో ముగ్గురు వ్యక్తులు సైబర్‌ మాయగాళ్ల చేతికి చిక్కారు. సుమారు రూ. 1.13 లక్షలు దోచుకోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఆదివారం సంచలనంగా మారింది. బాధితుల్లో పీహెచ్‌సీ ఏఎన్‌ఎం, హెల్త్‌సూపర్‌వైజర్‌ ఉండటం గమనార్హం. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన కాశీబుగ్గ హరిజనవీధికి చెందిన చల్లాక మహలక్ష్మి మెళియాపుట్టి మండలం కరజాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏఎన్‌ఎంగా పని చేస్తోంది. ఆదివారం ఈమెకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. తాను స్టేట్‌బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా.

మీకు కొత్త ఏటీఎం కార్డు వస్తుందని, ప్రస్తుత కార్డు పనిచేయదని నమ్మబలికాడు. ఈమె కార్డు నంబర్, పిన్‌ అడిగాడు. మీకు కొద్దిరోజుల్లో కొత్త కార్డు వస్తుందని అందుకు మీ సెల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని తీసుకున్నాడు. అక్కడకు కొద్ది నిమిషాల్లోనే 696198 ఒన్‌టైం పాస్‌వర్డ్‌ ఆన్‌లైన్‌ పర్చేస్‌ అంటూ రూ.48,999.00 మొబిక్విక్‌ కార్డు ఎండింగ్‌ నంబర్‌ 6332 అంటూ మెసేజ్‌ వచ్చింది. అప్పటికే తనిఖీ చేయగా మరో రూ.2,998 వేలు కట్‌ అయినట్లుగా మెసెజ్‌ వచ్చింది. అదేవిధంగా కాశీబుగ్గ బ్రాహ్మణవీధికి చెందిన గంటా అనితకు ఇదేవిధంగా ఫోన్‌ రావడంతో ఆమె కూడా వివరాలు చెప్పింది. కాశీబుగ్గ సిండికేట్‌ బ్యాంకు ఎకౌంట్‌ నంబర్‌ చివర 5055 నంబరులో రూ.10 వేలు కట్‌ అయింది. హెచ్‌డీఎఫ్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లుగా మెసెజ్‌ వచ్చింది. వీరిద్దరితోపాటు బ్రహ్మణతర్లాకు చెందిన హెల్త్‌ సూపర్‌వైజర్‌ కార్డు నుంచి రూ.49,998.00 కట్‌ అయింది. ఈ విషయమై ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ ఎస్‌ఐ రాజేష్‌ కేసు నమోదు చేశారు. పలాస స్టేట్‌ బ్యాంకు మేనేజరు దృష్టికి తీసుకెళ్లారు. ఓటీపీతోపాటు కార్డు వివరాలు అపరచితులకు ఇవ్వొద్దని, దీనికి తమ బాధ్యత కాదన్నారు. 

మరిన్ని వార్తలు