వడ్డీ తక్కువ.. మోసాలెక్కువ..!

4 Mar, 2019 09:14 IST|Sakshi

అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ నిపుణులు..

సాక్షి,సిటీబ్యూరో: ’హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న సురేష్‌ రూ.10 లక్షల రుణం పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఓ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ యవతి అతడికి ఫోన్‌చేసింది. రుణం మంజూరుకు ఆస్తి తనఖా పత్రాలతోపాటు రూ.50 వేలు నగదు చెల్లించాలని కోరింది. ఆ తరవాత ఆదాయ పన్ను పేరుతో మరో రూ.70 వేలు చెల్లించాలని కోరడంతో ఆమొత్తాన్ని చెల్లించారు. ఇలా పక్షం రోజుల్లో రూ.1.20 లక్షలు చెల్లించిన సురేష్‌కు అనుమానం వచ్చింది. రుణం ఎప్పడు మంజూరు చేస్తారని గట్టిగా నిలదీయడంతో చెక్కులు త్వరలో పంపుతామని చెప్పింది. ఆ తర్వాత రెండురోజులకు ఫోన్‌చేయగా స్విచాఫ్‌ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన సురేష్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు’. ఇది సురేష్‌ ఒక్కరి సమస్యే అని భావిస్తే పొరపాటే..ఇటీవలి కాలంలో గ్రేటర్‌ నగరంలో ఐటీ, బీపీఓ, కెపిఓ, ఫార్మా, బల్క్‌డ్రగ్‌ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఫోన్‌నెంబర్లను ఆయా సంస్థల వెబ్‌సైట్ల నుంచి సేకరిస్తున్న సైబర్‌నేరగాళ్లు తక్కువ వడ్డీలకు రుణాల పేరుతో సిటీజన్లకు ఎరవేస్తున్నారు. గత ఆరునెలలుగా సుమారు 25 మంది వరకు బాధితులు రూ. కోటికి పైగా మోసపోయినట్లు సైబర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 

తక్కువ వడ్డీ ..మోసాలు ఇలా..
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీగా ఉంటున్న సిటీజన్లకు సైబర్‌ నేరగాళ్లు.. రూ.100కు పావలావడ్డీ మాత్రమేనని, రుణ వాయిదాలు కూడా అధికమే నంటూ ఆన్‌లైన్‌లో అప్పుల వల విసురుతున్నారు.
నెట్‌వర్క్‌ సైట్లు, ఛారిటీ ట్రస్టులు, బ్యాంకిం గేతర ఆర్థిక సంస్థల పేరు చెప్పి ఆకర్షణీయమైన రుణ జారీ విధానాలను తెలియజేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.  
నగరంలోని ఐటీ, బీపీఓ, కెపిఓ, బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీల ఉద్యోగుల వివరాలు, ఫోన్‌నెంబర్లు సేకరించి వారికి టోకరా వేస్తున్నారు.
గత ఆరునెలలుగా సుమారు రూ.కోటికి పైగా ఇలాంటి సంస్థలు స్వాహా చేసినట్లు తేలింది.
ఈ ముఠాలు ఢిల్లీ, నోయిడా, చెన్నై, బెంగ ళూరు తదితర నగరాలే కేంద్రంగా ఇలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి.

అప్రమత్తతే కీలకం..
ఏదేని రుణజారీ సంస్థ ముందుగా సంబంధిత ధ్రువపత్రాల ప్రతులను మాత్రమే అడుగుతుందని..ప్రాసెసింగ్‌ ఫీజులు సైతం నామమాత్రంగానే ఉంటాయని బ్యాంకింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా సెక్యూరిటీ డిపాజిట్లు, ఇన్‌కంట్యాక్స్‌ ఇలా రకరకాల పేర్లతో డిపాజిట్లు సేకరించబోవని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి రుణం ఎరవేస్తే మీ పూర్తి వివరాలను, అవసరాలు తెలపరాదని..బ్యాంకు ఖాతాల నెంబర్లను షేర్‌ చేసుకోవద్దని సూచిస్తున్నారు. రుణం జారీకి సంబంధించి సంబంధిత బ్రాంచీల్లో నేరుగా మేనేజర్‌ లేదా ఇతర ఉన్నతాధికారులను సంప్రదించి స్పష్టత తీసుకోవాలని సూచిస్తున్నారు. రుణం తీసుకోబోయే ముందు రుణజారీ పత్రాలపై గుడ్డిగా సంతకాలు చేయకుండా సంబంధిత విధివిధానాలను, షరతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరవాతే రుణాలు పొందాలని సూచిస్తున్నారు.  రుణం జారీ చేసేకంటే ముందుగా వేలాదిరూపాయల నగదు చెల్లించాలని కోరితే వెంటనే అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు