ఆక్రోశం..ఆవేశం..ఆవేదన..

30 Jun, 2019 11:57 IST|Sakshi

ఊసరపెంటలో శనివారం సాయంత్రం వరకు టెన్షన్‌

ఆస్పత్రి నుంచి శవాన్ని తీసుకెళ్లని కుటుంబసభ్యులు

భారీగా తరలివచ్చిన దళిత సంఘాల నేతలు

సబ్‌ కలెక్టర్‌ చొరవతో హేమావతి భౌతికకాయానికి అంత్యక్రియలు 

సాక్షి, పలమనేరు(చిత్తూరు) : మండలంలోని ఊసరపెంటలో హేమావతి పరువుహత్య జరిగిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ఆక్రోశంతో ఆందోళనలు చేశారు. ఆగ్రహంతో రగిలిపోయారు. పలమనేరు ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగినా శవాన్ని తీసుకెళ్లడంలో గందరగోళం, ఆపై పోలీసుల చొరవతో శవాన్ని గ్రామానికి తరలింపు, అక్కడ శవం ముందే నిరసనలతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు సబ్‌కలెక్టర్‌ చొరవతో వివాదం సద్దుమణిగింది. సాయంత్రానికి భర్త పొలాల్లో భార్య హేమావతి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. 

ఆస్పత్రి నుంచే టెన్షన్‌.. టెన్షన్‌
కులాంతర వివాహం చేసుకుందనే కసితో కన్నకూతురినే చంపిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి దళిత సంఘాల నేతలు శనివారం పలమనేరుకు చేరుకున్నారు. హేమావతి మృత దేహానికి పోస్టుమార్టం పూర్తి అయినా నిందితులను అరెస్టు చేసే వరకు శవాన్ని తీసుకెళ్లమంటూ బాధితులు మొండికేశారు. ఏదో జరుగుతుందని ముందుగానే గ్రహించిన పోలీసులు ఆస్పత్రితోపాటు గ్రామంలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్ద భర్త అతడి కుటుంబ సభ్యులను ఒప్పించి,   భారీ భద్రత నడుమ ఊసరపెంటకు మృతదేహాన్ని తరలించారు. భర్త కేశవ ఇంటి ముందు ఉంచారు. 

భర్త బంధువుల ఆందోళన
అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న దళిత సంఘాల నాయకులు, హేమావతి భర్త బంధువులు ఆందోళన చేశారు. విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై అగ్రవర్ణాలు సాగిస్తున్న మారణహోమాన్ని రూపమాపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలు ప్రస్తుతం పసలేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించమంటూ భీష్మించుకున్నారు. దీంతో పోలీసులు బాధితులతో శనివారం సాయంత్రం వరకు మంతనాలు జరిపినా ఫలించలేదు. దీనిపై అగ్రహించిన వారు శవాన్ని పలమనేరుకు తీసుకెళ్లి అంబేద్కర్‌ విగ్రహం ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి గందరగోళంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త ఆదేశాలతో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ చేకూరి కీర్తి వస్తున్నారని చెప్పడంతో వారు శాంతించారు.

పసికందుకు రూ.5 లక్షల పరిహారం
బాధితుల డిమాండ్లను ఆలకించిన సబ్‌కలెక్టర్‌ చేకూరి కీర్తి వారిని శాంతిపజేశారు. తల్లికి దూరమైన పసికందును ఎత్తుకుని కాసేపు బాధపడ్డారు. తల్లికి దూరమైన ఆ బిడ్డకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. భర్త కేశవకు ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉపాధి, నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కేసు విచారణ జరపడంతోపాటు మిగిలిన సాయాలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన బాధితులు హేమావతి మృతదేహానికి భర్త కేశవ్‌ పొలాల్లోనే అంత్యక్రియలు జరిపారు. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో కర్ఫ్యూ విధించారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను మొహరించారు. దాదాపు 80 మంది పోలీసులు గ్రామాన్ని వారి అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు, స్థానిక సీఐ ఈద్రుబాషా, సత్యవేడు, మదనపల్లె సీఐలు రాజేంద్రప్రసాద్, మురళీకృష్ణ తదితరులు విధులను నిర్వహించారు. 

మరిన్ని వార్తలు