మా ముందే కుర్చీలో కూర్చుంటావా?

9 Jun, 2018 02:54 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో  ఓ దళిత మహిళ తమముందు కుర్చీపై కూర్చుని పనిచేయడం నచ్చని రాజ్‌పుత్‌ వర్గీయులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడి వారిని సజీవదహనం చేసేందుకు యత్నించారు.  అహ్మదాబాద్‌ జిల్లా వాల్తేరాలోని అంగన్‌వాడీ కేంద్రంలో పల్లవిబెన్‌ జాదవ్‌(45) పనిచేస్తున్నారు. గ్రామస్తులకు మంజూరైన ఆధార్‌ కార్డుల్ని పంచే బాధ్యతను అధికారులు ఆమెకు అప్పగించారు.

దీంతో పల్లవిబెన్‌ బుధవారం గ్రామంలో ఆధార్‌కార్డులు పంచుతుండగా అక్కడికి చేరుకున్న కరదియా రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన జయరాజ్‌ వేగద్‌ ‘దళితురాలివైన నువ్వు మాముందే కుర్చీలో కూర్చుంటావా?’ అని తిడుతూ దాడికి పాల్పడ్డాడు. అదేరోజు రాత్రి  జయరాజ్‌ నేతృత్వంలో 25 మంది దుండగులు పల్లవి ఇంటివద్ద ఆమె కుటుంబ సభ్యులపై కర్రలు, పదునైన ఆయుధాలతో దాడికి దిగారు.  ఆమె కుటుంబ సభ్యుల్ని సజీవదహనం చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టుచేశారు.

మరిన్ని వార్తలు