ముంబైలో దావూద్‌ అనుచరుడి అరెస్ట్‌

24 Jun, 2018 16:29 IST|Sakshi
దావూద్‌ ఇబ్రహీం(పాత చిత్రం)

ముంబై : అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు రామ్‌దాస్‌ రహానేను ముంబై పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. దావూద్‌ గ్యాంగ్‌కి చెందిన రహానే పాకిస్తాన్‌లోని సహాచరుల ఆదేశాల మేరకు ఓ హోటల్‌ యాజమానిపై బెదిరింపులకు పాల్పడినందుకు ముంబై యాంటి ఎక్స్‌టార్షన్‌ సెల్‌(ఏఈసీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్‌ యాజమానికి ఫోన్‌ చేసిన రహానే.. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశాడు. అంతేకాకుండా 5 లక్షలు వెంటనే అందజేయాలని హెచ్చరించాడు. దీంతో హోటల్‌ యాజమాని పోలీసులను ఆశ్రయించాడు. తనకు పాకిస్తాన్‌ నుంచి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇందులో రహానే హస్తం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. సంగమనేరులోని రహానే ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేయడంతో పాటు ఓ తుపాకిని, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ అరెస్ట్‌పై డీసీసీ దిలీప్‌ సావంత్‌ మాట్లాడుతూ.. రహానే దావూద్‌ గ్యాంగ్‌లోని ముఖ్య సభ్యులలో ఒకరని తెలిపారు. హోటల్‌ యాజమాని ఫిర్యాదు మేరకు రహానేను అరెస్ట్‌ చేశామన్నారు. రహానేపై 11 సీరియస్‌ కేసులున్నట్టు వెల్లడించారు. 2011లో ప్రముఖ బిల్డర్‌ మనీష్‌పై చర్చిగేట్‌ సమీపంలో జరిగిన దాడిలో రహానే ప్రధాన పాత్ర పోషించాడని పేర్కొన్నారు. 2017లో దావూద్‌ సోదరుడు అనీస్‌ ఇబ్రహీం ఆదేశాల మేరకు జామ్‌నగర్‌కు చెందిన వ్యాపారి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నందుకు  రహానేతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు