‘పోలీసుల పాత్ర ఉంటే వారిపై చర్యలు తప్పవు’

20 Feb, 2019 17:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో పోలీసుల పాత్ర ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ ఎఆర్‌ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌లను తప్పించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. కేసుతో సంబంధం ఉన్న అధికారులనుంచి అన్ని విషయాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు. హత్య జరగకముందు జరిగిన తరువాత కాల్ డేటా ఆధారంగా వారిని ప్రశ్నించినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాకేశ్ రెడ్డి.. స్నేహితుల మధ్య గొడవ విషయాన్ని మాత్రమే ఫోన్ కాల్‌లో చెప్పినట్లు ఏసీపీ తెలిపాడు. రాకేశ్ రెడ్డి.. మల్లారెడ్డికి కాల్ చేస్తే మొదట లిఫ్ట్ చెయ్యలేదు. తరువాత మిస్డ్ కాల్స్ చూసుకొని మల్లారెడ్డి రాకేశ్ రెడ్డికి కాల్ చేశాడు.

నటుడు సూర్య ప్రసాద్  మభ్య పెట్టి జయరాంను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చాడు. రాకేష్‌తో టచ్‌లో ఉన్న మరి కొంత మంది పోలీస్ ఉన్నతాధికారులను కూడా విచారణకి పిలుస్తాం. జయరామ్‌ భార్య పద్మ శ్రీతో మేము టచ్‌లో ఉన్నాము. ఆమెకు ఉన్న అనుమానాలను తీర్చుతాము. రాయదుర్గం సీఐ ఫోన్ కాల్ తరువాత జూబ్లీహిల్స్ పోలీసులకు రాకేశ్ ఫోన్ చేశాడు. రాకేశ్ రెడ్డికి టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయనేది వాస్తవం. అన్ని పార్టీల నేతలతో రాకేశ్ టచ్‌లో ఉన్నాడు. హత్య జరిగిన తరువాత రాజకీయ నేతలలెరితోనూ రాకేశ్ మాట్లాడలేదు.  53 ఎకరాల భూమిలో 6 ఎకరాలు రాకేశ్ రెడ్డి కబ్జా చెయ్యాలని ప్రయత్నం చేశాడని’ వెల్లడించారు.

మరిన్ని వార్తలు