అవినీతి ఐఏఎస్‌.. డిటెక్టివ్‌ జంటకు ఝలక్‌

4 Nov, 2017 09:49 IST|Sakshi

థానే : ఓ సీనియర్ సివిల్‌ సర్వీస్ అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో డిటెక్టివ్‌ దంపతులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్లు థానే పోలీసులు ప్రకటించారు. ప్రైవేట్‌ డిటెక్టివ్‌ సతీష్‌ మంగలే ఆయన భార్య శ్రద్ధాలు ఐఏఎస్‌ అధికారి రాధేశ్యామ్‌ మోపల్‌వార్‌ను ఏడు కోట్లు చెల్లించాలంటూ గత కొంత కాలంగా బెదిరిస్తున్నారు.

అక్టోబర్ 23న ఆ డబ్బును నాసిక్‌ హైవేలో ఉన్న ఖరేగావ్‌ టోల్‌ ఫ్లాజా వద్ద అప్పగించాలని.. లేకపోతే రాధేశ్యామ్‌ అవినీతి గుట్టును బయటపెడతామని వాళ్లు బెదిరించారు. దీంతో మోపల్‌వార్‌ ఆ ఫోన్లను నేరుగా థానే పోలీసులకు అనుసంధానం చేశారు. బెదిరింపులు నిజమని నిర్థారించుకున్న తర్వాత చివరకు ఓ కానిస్టేబుల్‌ను మారువేషంలో కోటి రూపాయలు ఇచ్చి దొంబివాలీలో ఆ దంపతులు అద్దెకు ఉంటున్న ఇంటికి పంపించారు. అనంతరం డబ్బు తీసుకుంటుడగా వారిని వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ దంపతులతోపాటు వారికి సహకరించిన అనిల్‌ వేద్‌మెహతాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కీలక సమాచారం ఉన్నట్లుగా భావిస్తున్న రెండు ల్యాప్‌ ట్యాప్‌లు, ఐదు సెల్‌ఫోన్‌లు, నాలుగు పెన్‌ డ్రైవ్‌లు, 15 సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు థానే పోలీసులు వెల్లడించారు.

కాగా, మహారాష్ట్ర రాష్ట్ర రోడ్లు అభివృద్ధి సంస్థకు రాధేశ్యామ్‌ గతంలో వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించేవారు. అవినీతి ఆరోపణలు వెలుగు చూడటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆగష్టులో ఆయన్ని సస్పెండ్‌ చేశారు. అయితే సతీష్ మంగలే లీక్ చేసిన ఆడియో సంభాషణల మూలంగానే ఆయన అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్న ఓ వాదన ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి టేపులు భయటపెడతామంటూ బెదిరించి ఆ డిటెక్టివ్‌ దంపతులు రాధేశ్యామ్‌ను మరోసారి బెదిరించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు