కిరణ్‌బేడీకి షాక్‌

4 Nov, 2017 09:52 IST|Sakshi
కిరణ్‌బేడీ ,మనోజ్‌ ఫరిదా

బోర్డు అధ్యక్షుల పదవీకాలం పెంపు

కేంద్ర ప్రభుత్వ అంగీకారం పుదుచ్చేరి సీఎస్‌ బదిలీ

టీ.నగర్‌: పుదుచ్చేరిలో ఏడుగురు ఎమ్మెల్యేల బోర్డు అధ్యక్షుల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో గవర్నర్‌ కిరణ్‌బేడి నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ అనూహ్య పరిణామాలతో పుదుచ్చేరి చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌ ఫరిదా బదిలీ అయ్యారు. పుదుచ్చేరిలో 30కి పైగా బోర్డు అధ్యక్షుల పదవులు కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు, పార్టీ నిర్వాహకులకు అందజేయడం పరిపాటి. 2016 మేలో కాంగ్రెస్‌–డీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు ధనవేలు, విజయవేణి, బాలన్, తీప్పాయిందాన్, జయమూర్తి ఐదుగురు డీఎంకేలో శివ, గీతా ఆనందన్‌ బోర్డు అధ్యక్షులుగా పదవులు చేపట్టారు. ఏడుగురు బోర్డు అధ్యక్షులు ఏడాదిపాటు మాత్రమే పదవుల్లో కొనసాగే వీలుంది. అంతేకాకుండా వారి కార్యనిర్వహణ సామర్థ్యాన్ని బట్టి వారు పదవుల్లో కొనసాగే అవకాశం ఉందనే నిబంధన మేరకు గవర్నర్‌ కిరణ్‌బేడి అంగీకారం తెలిపారు.

ఇలావుండగా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా బోర్డు అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగించేందుకు మంత్రి వర్గం నిర్ణయించి గవర్నర్‌కు ఫైలు పంపింది. అయితే దీన్ని నిరాకరించిన గవర్నర్‌ బోర్డు అధ్యక్షుల ఏడాది కాలం కార్యాచరణ నివేదికను కోరుతూ నిషేధం విధించారు. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలు బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగలేక తప్పుకున్నారు. తర్వాత ఈ ఫైలును ఏకాభిప్రాయం కుదరలేదంటూ కేంద్ర ప్రభుత్వానికి కిరణ్‌బేడి పంపారు. ఆ తర్వాత హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి నారాయణస్వామి కలిసి బోర్డు అధ్యక్షుల పదవీ కాలం కొనసాగింపునకు అనుమతిని ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు. కేంద్ర హోంశాఖ నుంచి గురువారం పుదుచ్చేరి గవర్నర్, ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ అందింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్‌కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు మళ్లీ బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగేందుకు అనుమతి అందజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొద్ది రోజుల్లో బోర్డు అధ్యక్షులందరూ తమ పదవులను అందుకోనున్నారు.

పుదుచ్చేరి సీఎస్‌ బదిలీ: గవర్నర్‌తో విభేదాల కారణంగా  పుదుచ్చేరి చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌ ఫరిదా బదిలీకి గురయ్యారు. పుదుచ్చేరి 2016 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గం ఏర్పాటైంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కిరణ్‌బేడీని గవర్నర్‌గా నియమించగా కేంద్ర ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీగా చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌ ఫరిదా హోదా పెంచబడింది. అయినప్పటికీ ఆయన ఢిల్లీ వెళ్లకుండా పుదుచ్చేరిలో పనిచేస్తూ వచ్చారు. ఇలావుండగా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టగానే కిరణ్‌బేడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోసాగారు. దీంతో సీఎం నారాయణసామితో ఘర్షణ వైఖరి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా మనోజ్‌ ఫరిదా నిలిచారు. ఆ తర్వాత ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేల వ్యవహారంలోను కేంద్ర హోంశాఖకు వ్యతిరేకంగా చీఫ్‌ సెక్రటరీ పనిచేస్తున్నట్లు గవర్నర్, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరి చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌ ఫరిదా అకస్మికంగా ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఆయనకు బదులుగా ఢిల్లీలో చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చిన అశ్విన్‌కుమార్‌ పుదుచ్చేరికి నియమితులయ్యారు. ఆయన త్వరలో పుదుచ్చేరికి వచ్చి పదవీ భాద్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని వార్తలు