దిశ కేసు: పోలీసు కస్టడీకి నిందితులు

5 Dec, 2019 10:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను పోలీసులు తొలిరోజు కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.  వారం రోజులపాటు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్‌ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా నిందితుల సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.   జైల్లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేసినట్టు తెలుస్తోంది.

నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గురువారం తెల్లవారుజామున 3.45 గంటలకు నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి.. సీన్‌ రీకన్‌స్ట్రక‌్షన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణను తర్వితగతిన పూర్తి చేయడానికి ఇప్పటికే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుచేసిన నేపథ్యంలో వీలైనంత తర్వగా నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి లారీలో దొరికిన ఆధారాలను ఇప్పటికే ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు అధికారులు పంపించారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్‌ (ఎఫ్ఎస్ఎల్‌) నివేదిక కీలకం కానుంది.
చదవండి: రంగంలోకి ఏడు బృందాలు.. నెలలోపే చార్జ్‌షీట్‌

కస్టడీలోకి తీసుకున్న నిందితులను విచారించేందుకు శంషాబాద్‌ డీసీపీ నేతృత్వంలో  కమిటీ ఏర్పాటైంది. నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. నిందితులను విచారించడం, శాస్త్రీయ ఆధారాల సేకర, ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నివేదికలు తెప్పించడం తదితర అంశాలపై కమిటీ దృష్టి సారించింది. దిశ కిడ్నాప్‌, రేప్‌, హత్య తదితర కేసులన్నింటినీ  ఈ కమిటీ నేతృత్వంలో పలు బృందాలు విచారించనున్నాయి.

దిశను ఎలా ట్రాప్ చేశారు?
వారం రోజుల కస్టడీలో భాగంగా నిందితులను విచారించి.. వారి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసుకోనున్నారు. ఈ విచారణ సందర్భంగా నిందితుల దగ్గరికి నుంచి కీలక ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. హత్యాచారం, హత్య జరిగిన సంఘటన స్థలానికి నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక‌్షన్ చేయనున్నారు. సీన్ టూ సీన్ మొత్తం వివరాలను నిందితుల నుంచి పోలీసులు రాబట్టనున్నారు. దిశ మొబైల్‌ను ఏం చేశారనే నిందితులను ప్రశ్నించనున్నారు. దిశను ఎలా ట్రాప్ చేశారు, అత్యాచారం, హత్య చేసి అనంతరం ఎందుకు దిశ శరీరాన్ని తగలబెట్టారనే వివరాలు క్షుణ్ణంగా నిందితుల నుంచి తెలుసుకోనున్నారు.

ఈ దారుణమైన సంఘటనకు ముందు నిందితులు మద్యం సేవించారా అనేది కూడా పోలీసులు తెలుసుకోనున్నారు. నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడంతోపాటు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను ఏ ప్రదేశంలో విచారిస్తారనే దానిపై పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.  పోలీసుల కస్టడీ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద ఎలాంటి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా సెక్షన్ 144ను విధించారు.

ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు
 దిశ కేసులో దోషులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటైంది. జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు వీలుగా బుధవారం రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌ మొదటి అదనపు సెషన్స్‌ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీగా ‘దిశ’కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు విచారించి సత్వరం తీర్పు వెలువరించనుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు కావడం ఇది రెండోసారి. ఇటీవల వరంగల్‌ జిల్లాలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో సత్వర విచారణ జరిపిన కోర్టు 56 రోజుల్లో తీర్పు చెప్పింది. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా