మిస్టరీ వీడిన జంట హత్యల కేసు

9 May, 2019 07:46 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ నిందితుడు అబిడ్‌ ఆలం

భార్యను, కుమారుడిని హతమార్చిన నిందితుడి అరెస్టు  

నాగోలు: కట్టుకున్న భార్యను, కుమారుడిని హత్య చేసిన నిందితుడిని వనస్థలిపురం పోలీస్‌లు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు  రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. బుధవారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల  సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. బిహార్‌ రాష్ట్రం పాట్నాకు చెందిన మొహాద్‌ అబిడ్‌ ఆలం (27) 2010లో నగరానికి వచ్చాడు. వనస్థలిపురం ఇందిరా నగర్‌లో ఓ ఇంట్లో కిరాయికి ఉండేవాడు. నగర శివారులోని సెయింట్‌ మేరీ ఇంజినీంగ్‌ కళాశాలలో 2014లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అబిడ్‌ ఆలం నివసించే ఇందిరానగర్‌లోని ఇంటి పక్కనే యువతి కవిత ఉండేది. వీరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసి పెళ్లి చేసుకున్నారు.

అబిడ్‌ ఆలం, కవిత అలియాస్‌ సభా కలిసి ఆటోనగర్‌ విజయ శ్రీకాలనీలో నివాసం ఉండేవారు. వీరికి రెండేళ్ల వయసున్న కుమారుడు మొహాద్‌ ఇర్ఫాన్‌ ఉన్నాడు. కొన్ని రోజులుగా భార్య కవితపై అనుమానం పెంచుకున్నాడు. ఇటీవల ఆమెపై దాడి చేసి టవల్‌ను మెడకు చుట్టి హత్య చేశాడు.  అనంతరం కుమారుడు ఇర్ఫాన్‌ ముక్కు మూసి చంపేశాడు. అనంతరం మృతదేహాలను ఇంట్లోని వాటర్‌ డ్రమ్ములో వేసి పారిపోయాడు. గత నెల 30న ఇంట్లోంచి దుర్వాసన రావడంతో  చుట్టుపక్కల వారు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. తల్లీ కొడుకులను  హత్య చేసి డ్రమ్ములో పడేసి పారిపోయినట్లు పరారైనట్లు తెలుసుకున్నారు. కవిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం మేడ్చల్‌ పరిధిలో అబిడ్‌ ఆలంను అరెస్టు చేశారు. భార్యపై అనుమానంతో తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీగాంధీనారాయణ.సీఐ వెంకటయ్య, డీఐలు జగన్నాధం, సత్యనారా యణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు