ఇండియన్‌ రెస్టారెంట్‌లో పేలుడు కలకలం!

25 May, 2018 11:10 IST|Sakshi

టొరంటో : ప్రవాస భారతీయులకు చెందిన రెస్టారెంట్‌లో పేలుడు సంభవించడం కలకలం రేపింది. కెనడా, ఒంటారియోలోని బాంటే భేల్‌ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం రాత్రి 10:30 గంటలకు రెస్టారెంట్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పలువురు భారతీయులు హోటల్లో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

అయితే జరిగని ఘటన ఉగ్రవాదుల చర్య అని అప్పుడే చెప్పలేమన్నారు కెనడా పోలీసులు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామని వివరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. గత నెలలో టొరంటోలో ఓ డ్రైవర్‌ వ్యాన్‌ అద్దెకు తీసుకుని దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృత్యువాత పడగా, మరో 15 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.

స్పందించిన సుష్మా స్వరాజ్‌
రెస్టారెంట్‌లో పేలుడు ఘటనపై విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందించారు. కెనడాలో భారత హైకమిషనర్‌తో, టొరంటో కాన్సుల్‌ జనరల్‌తో విషయం అడిగి తెలుసుకున్నాం. తగిన సహాయం అందేలా చూస్తామని ఆమె చెప్పారు. ఎమర్జెన్సీ టోల్‌ ఫ్రీ నెంబర్‌.. +1-647-668-4108 అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు