చేంగల్‌ ఘటనలో ఆరుగురి అరెస్టు

25 May, 2018 10:59 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఇన్‌చార్జి సీపీ శ్వేత

నిజామాబాద్‌ క్రైం : పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలుగా భావించి చేంగల్‌ గ్రామస్తులు జరిపిన దాడులో ఒకరు మృతి చెందిన కేసులో ఆరుగురిని అరెస్టు చేశామని ఇన్‌చార్జి ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ శ్వేత తెలిపారు. గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చేంగల్‌ ఘటన వివరాలను ఇన్‌చార్జి సీపీ వివరించారు. బఢా భీమ్‌గల్‌ ఎంజీ తండాకు చెందిన దేగవత్‌ లాలూ, ధర్పల్లి మండలం ఎంజీ తండాకు చెందిన అతడి బావమరిది మలావత్‌ దేవ్యాలు ఈనెల 22న చేంగల్‌ గ్రామ శివారులోని మామిడి తోటలో మామిడి కాయలు తెంపడానికి వెళ్లారన్నారు.

పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నాయన్న వదంతులు వ్యాప్తిలో ఉండడంతో వారిని దొంగలుగా భావించిన ఓ బాలుడు.. తమను ఎత్తుకెళ్లేందుకు దొంగలు వచ్చారని తండ్రి భిక్షపతికి చెప్పాడన్నారు. అతను గ్రామంలో మరికొందరికి విషయాన్ని తెలిపాడని, వారంతా వచ్చి దేవ్యా, లాలూలను చితకబాది, గ్రామ కమిటీ భవనంలో నిర్బంధించారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి దేవ్యా, లాలూలను ఆర్మూర్‌లోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారన్నారు. ఇందులో మాలావత్‌ దేవ్యా పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారని, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పేర్కొన్నారు. లాలూ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు.  

23 మందిపై కేసులు.. 
ఈ ఘటనపై భీమ్‌గల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దేవ్యా మృతికి కారణమైన వారిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారని ఇన్‌చార్జి సీపీ తెలిపారు. ఈ ఘటనతో 23 మందికి సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు.. ఇందులో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. అరెస్టైన చిక్కడి భిక్షపతి, చెవుల శ్రీనివాస్, చాకలి నరేశ్, సిరోల్ల రాహుల్, తోపారం వినీత్, మోహిని నరేశ్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న 17 మందిని త్వరలో పట్టుకుంటామని, వీరికోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. అలాగే చేంగల్‌ గ్రామస్తుల ఇళ్లపై దాడులు చేసిన మృతుడి తాలూకు వారిపైనా కేసులు నమోదు చేశామన్నారు.  

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు 
ప్రజలు ఎటువంటి సంఘటనలోనైనా తొందరపడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఇన్‌చార్జి సీపీ శ్వేత సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్‌ 100కు లేదా సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసులు అనుమానితులను పట్టుకుని విచారించి తగిన చర్యలు తీసుకుంటారన్నారు. 
సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు, వీడియో క్లిప్పులు నిజమైతే వాటిని ఇతరులకు పోస్టు చేయాలే తప్ప వదంతులను వ్యాపింపజేయవద్దని కోరారు. అసత్య ప్రచారాలపై ప్రజల్లో అవగాహన కోసం పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీపీలు ఆకుల రాంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఆర్మూర్‌ ఏసీపీ శివకుమార్, సీఐ రమణారెడ్డి పాల్గొన్నారు.   
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా