వీచాట్‌, క్యాస్పర్‌స్కైపై నిషేధం.. కారణం ఇదే..

31 Oct, 2023 12:55 IST|Sakshi

కెనడా ప్రభుత్వం చైనా మెసేజింగ్‌ అప్లికేషన్‌ వీచాట్‌ను, రష్యన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ కాస్పర్‌స్కైను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీచాట్‌ యాప్‌ విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగించే యాప్స్‌లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దక్షిణాసియా వాసులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది.

వీచాట్‌ యాప్‌ నుంచి కీలకమైన డేటా లీక్‌ అవుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ.. రిస్క్‌ను అంచనావేసి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ పరికరాల నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించినట్లు కెనడా ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలు అనితా ఆనంద్‌ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై వీచాట్‌ యజమాని అయిన టెన్సెంట్‌ సంస్థ స్పందించలేదు. మరోవైపు రష్యాకు చెందిన క్యాస్పర్‌స్కైపై కూడా చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. దాంతో కంపెనీ వర్గాలు మాట్లాడుతూ కెనడా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని, నిరాశను కలిగించిందని తెలిపాయి. ప్రభుత్వ ఆందోళనలను పరిష్కరించడానికి సంస్థకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ రెండు అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 

మరిన్ని వార్తలు