స్పాట్‌ అపాయింట్‌ మెంట్‌.. ఢిల్లీలో ట్రైనింగ్‌

29 Aug, 2018 09:04 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

రైల్వేలో టీసీ ఉద్యోగాల పేరుతో టోకరా నలుగురి అరెస్టు  

ఒక్కొక్కరి నుంచి రూ.ఐదు లక్షల చొప్పున వసూలు

వెంటనే నకిలీ నియామక పత్రాలు, ఢిల్లీలో ట్రైనింగ్‌ సైతం

సాక్షి, సిటీబ్యూరో/లింగోజిగూడ: రైల్వేలో టికెట్‌ కలెక్టర్‌ ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన  నలుగురు నిందితులను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రాచకొండ ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సయ్యద్‌ రఫీక్‌ మంగళవారం వివరాలు వెల్లడించారు. మల్కాజ్‌గిరికి చెందిన శ్రీకాంత్, మలక్‌పేట్‌కు చెందిన సంజయ్‌ స్నేహితులు. వీరికి నగరంలో సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్న బండారు గౌరీ శంకర్‌తో పరిచయం ఏర్పడింది. సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం పన్నిన శ్రీకాంత్‌ తనకు రైల్వేలో మంచి పరిచయాలున్నాయని, ఎవరైనా అభ్యర్థులను తీసుకువస్తే లంచాలు ఇచ్చి ఉద్యోగాలిప్పిస్తానని సంజయ్, గౌరీ శంకర్‌లకు చెప్పాడు. ఈ విషయాన్ని సంజయ్‌ తన బంధువు చైతన్యపురికి చెందిన ఉమాదేవికి చెప్పడంతో ఆమె ఇద్దరు అభ్యర్థులను సంజయ్‌కి పరిచయం చేసింది. అనంతరం వారు సదరు యువకులకు రైల్వేలో టికెట్‌ కలెక్టర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇందుకుగాను రూ.16 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారి మాటలు నమ్మిన అభ్యర్థులు రూ.ఐదు లక్షల చొప్పున రూ.10 లక్షలు చెల్లించడంతో ఉమాదేవి, సంజయ్‌ తమ కమీషన్లు రూ.2 లక్షల చొప్పున తీసుకుని మిగతా మొత్తాన్ని  శ్రీకాంత్‌కు అందజేశాడు. అనంతరం శ్రీకాంత్‌ వారిని నమ్మించేందుకు రైల్వేలో ఉద్యోగం వచ్చినట్లుగా నకిలీ నియామక పత్రాలు అందజేసి, శిక్షణ నిమిత్తం ఢిల్లీకి తీసుకెళ్లి  పది రోజుల పాటు అక్కడే ఉంచాడు. శిక్షణ అనంతరం  కొద్ది రోజుల్లో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని చెప్పి పంపారు. ఇదే విధంగా  గౌరీశంకర్‌ తీసుకొచ్చిన మరో అభ్యర్థిని కూడా ఇదే తరహాలో టోకరావేయడంతో వారిపై అనుమానం వచ్చిన అతను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్, ఎస్సై రాజు దర్యాప్తు చేపట్టారు. రైల్వే ఉద్యోగం ఆశిస్తున్న అభ్యర్థిలా వెళ్లిన పోలీసులు మంగళవారం  చైతన్యపురిలో నిందితులను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం చైతన్యపురి పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా