అంతర్రాష్ట్ర నకిలీ ఆయుర్వేద మోసగాళ్లు అరెస్టు

28 Mar, 2018 09:50 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న తిరుపతి క్రైమ్‌ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి

తిరుపతిలో అమాయక రోగులే లక్ష్యంగా దోపిడీ

రూ.లక్షల నగదు, నకిలీ మందులు స్వాధీనం

తిరుపతి క్రైమ్‌: ఎలాంటి రోగాన్నైనా ఇట్టే తగ్గిస్తామంటూ నకిలీ ఆయుర్వేద మందులను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.6 లక్షల 90 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు, రూ.4 లక్షల 84 వేల విలువ చేసే చెక్కులు, రూ.5 లక్షల 10 వేలు విలువ చేసే ఆయుర్వేద మందులు, నకిలీ చూర్ణం స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తిరుపతిలో క్రైమ్‌ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాలకు వచ్చే రోగులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఆయుర్వేద మందులను విక్రయిస్తూ నకిలీ వైద్యుల ముఠా రూ.లక్షలు గుంజు తుందని డీఎస్పీ తెలిపారు. ఇలా మోసం చేస్తున్నవారిపై ఫిర్యాదు వచ్చిం దన్నారు. కర్ణాటకకు చెందిన 13 మంది ముఠాగా ఏర్పడి నకిలీ ఆయుర్వేద వైద్యులుగా చలామణి అవుతున్నారని తెలిసిందన్నారు. ఈ ముఠాలోని ఇద్దరు కీలక వ్యక్తులను మంగళవారం అలిపిరి రోడ్డులోని యాత్రికుల నడకదారిలో అరెస్టు చేశామన్నారు. వీరిని కర్ణాటకకు చెందిన రవిశెట్టి అలియాస్‌ రవికుమార్‌ యాదవ్‌ (38), బాగల్‌కోట కుమార్‌ (42)లుగా గుర్తించామని చెప్పారు.

మోసం ఇలా..
13 మంది ముఠా ఎస్వీ ఆయుర్వేద హాస్పిటల్‌కు మోకాళ్లు, మెడ నొప్పులతో వచ్చే రోగులను గుర్తించేవారు. 15 రోజుల్లోనే ఆరోగ్యవంతులవుతారని నమ్మించి శ్రీ సిద్ధి వినాయక ఆయుర్వేద మందుల దుకాణానికి వెళ్లి వైద్యున్ని సంప్రదించాలనేవారు. అక్కడ రూ.30 వేలు నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవారని పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో క్రైమ్‌ సీఐలు భాస్కర్‌రెడ్డి, అబ్బన్న, శరత్‌చం ద్ర, రసూల్‌ సాహెబ్, పద్మలత, ఎస్‌ఐ రమేశ్‌ బాబు, సిబ్బంది తదితరులు కృషి చేశారన్నాని డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు