అప్పులే యమపాశాలై.. 

17 Apr, 2018 08:19 IST|Sakshi
చికిత్సపొందుతున్న లింగేశ్వరమ్మను పరిశీలిస్తున్న ఏఎస్పీ షేక్‌షావలి  

పిల్లలకు విషం తాగించి భార్యాభర్త ఆత్మహత్యాయత్నం 

భర్త మృతి.. భార్య, పిల్లల పరిస్థితి విషమం 

కర్నూలు మండలం దిన్నెదేవరపాడులో ఘటన 

ఆ దంపతులు బాగా బతకాలని కలలు కన్నారు. అప్పు తెచ్చి వ్యాపారం మొదలు పెట్టారు. శక్తివంచన లేకుండా కష్టపడుతున్నా వారికి వ్యాపారం కలిసి రాలేదు. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోయింది. తీర్చే దారి లేకపోయింది. చావే శరణ్యమని భావించారు. పిల్లలకు విషం తాగించి.. వారూ తాగారు. భర్త మృతిచెందగా.. భార్య, ముగ్గురు పిల్లలు మృత్యువుతో పోరాడుతున్నారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన పలువురిని కలచివేసింది. 

కర్నూలు హాస్పిటల్‌/సి.క్యాంపు : దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మధు(30), లింగేశ్వరమ్మ(25) దంపతులు దాణా వ్యాపారంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి చిట్టెమ్మ(7), మౌనిక(5), వంశీ(3) సంతానం. ఎంతో అన్యోన్యంగా జీవించే వారి కుటుంబంలో ఇటీవల ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. దాణా వ్యాపారం కోసం రూ.25లక్షలు పెట్టి ఐదు బొలెరో వాహనాలు కొనుగోలు చేశారు. వ్యాపారంలో రోజుకు రూ.25వేలు ఆదాయం రావాల్సి ఉండగా రూ.3వేలు కూడా వచ్చేది కాదు. వస్తున్న ఆదాయానికీ  చేస్తున్న ఖర్చుకు పొంతన లేకపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి.

ఏడాది నుంచి నష్టంతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. మరోవైపు తెచ్చుకున్న అప్పులకు వడ్డీ పెరిగిపోయింది. ఈ అప్పులకు సంబంధించి మూడు నెలల నుంచి భార్యాభర్తలు ఇంట్లో గొడవపడేవారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఆస్తి తగదాలు ప్రారంభమయ్యాయి. మధుకు ముగ్గురు సోదరులు. వీరికున్న మూడిళ్లను నలుగురూ పంచుకునే విషయంలో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంటికి గడియపెట్టుకుని ముందుగా పురుగుల మందును పిల్లలకు తాగించి, అనంతరం భార్యాభర్తలిద్దరూ తాగారు.  

చిన్నారి బిగ్గరగా ఏడవటంతో.. 
విషం తాగిన వెంటనే ఐదుగురూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికి చిన్నారి మౌనిక వాంతులు చేసుకుంటూ బిగ్గరగా ఏడ్వడంతో ఇరుగుపొరుగు వారు అనుమానించి తలుపులు బద్దలు కొట్టారు. పోలీసులకు, అంబులెన్స్‌కూ సమాచారం ఇచ్చి అందరినీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపు మధు మృతి చెందాడు.  భార్య లింగేశ్వరమ్మతో పాటు చిట్టెమ్మ(లక్ష్మి) పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.   

ఆదాయానికి మించి అప్పులు చేయొద్దు –ఏఎస్పీ షేక్‌షావలి 
జీవితంలో చిన్న చిన్న సమస్యలు సాధారణమని, ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదని అడిషనల్‌ ఎస్పీ షేక్‌షావలి చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆయన కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషాతో కలిసి సందర్శించి, వారికి అందుతున్న వైద్యం, వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పులు చేసే పరిస్థితికి ఎవ్వరూ రాకూడదని, ఆదాయానికి తగ్గట్లు జీవించాలని సూచించారు. కుటుంబం ఆత్మహత్యాయత్నానికి సంబంధించి విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు