ప్రణయ్‌ హత్యకేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 

20 Sep, 2018 02:52 IST|Sakshi
కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడుతున్న అమృత, ప్రణయ్‌ కుటుంబ సభ్యులు

అమృతకు ఉద్యోగం, ఇల్లు

కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ హామీ

నల్లగొండ క్రైం: ప్రణయ్‌ హత్యకేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ఎస్పీ ఏవీ రంగనాథ్‌లు ప్రణయ్‌ భార్య అమృత, ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బుధవారం అమృత, ప్రణయ్‌ కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో వారిని కలిశారు. కలెక్టర్, ఎస్పీలు వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. అమృత–ప్రణయ్‌ల మధ్య పరిచయం, చదువు మధ్యలో ఆపివేసిన పరిస్థితులు, వీరి పెళ్లికి కుటుంబ సభ్యుల అభ్యంతరం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అమృతకు ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. రూ.4లక్షలు అందజేశామని, ఉద్యోగం, ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేసులో ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు కావాలో చెప్పండని వారు అమృత, కుటుంబ సభ్యులను కోరగా నిందితులకు బెయిల్‌ రాకుండా చూడాలని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశం తర్వాత వారు మీడియాకు వివరాలు తెలిపారు. అంతకుముందు హత్య ఘటన, కేసు విచారణ, నిందితుల వివరాలు, చట్టం ప్రకారం తీసుకుంటున్న చర్యలను ఎస్పీ.. వారికి వివరించినట్లు తెలిసింది.

ప్రణయ్‌ ట్రస్టు ఏర్పాటు చేస్తా 
మారుతీరావు ఆస్తులన్నీ ట్రస్టుకు అప్పగించాలి: అమృత డిమాండ్‌
మిర్యాలగూడ: ప్రేమ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న పెరుమాళ్ల ప్రణయ్‌ పేరున ట్రస్టు ఏర్పాటు చేస్తానని అతని భార్య అమృత వర్షిణి పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షి’తో ఆమె మాట్లాడుతూ... తన తండ్రి మారుతీరావు ఇంట్లో ఉన్న అమృత జీనియస్‌ స్కూల్‌ భవనాన్ని ట్రస్టుకు కార్యాలయంగా చేయాలని, ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ట్రస్టుకు చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. మారుతీరావు ద్వారా నష్టపోయిన బాధితులందరికీ ప్రణయ్‌ ట్రస్టు ద్వారా న్యాయం చేస్తానన్నారు.  

బెయిల్‌ ఇవ్వకుండా ఉరితీయాలి 
ప్రణయ్‌ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులు బెయిల్‌ కూడా ఇవ్వకుండా ఉరి తీయాలని ప్రణయ్‌ భార్య అమృత, తండ్రి బాలస్వామి డిమాండ్‌ చేశారు. శ్రవణ్‌ బయటకు వస్తే తమను కూడా చంపుతాడని, నిందితులు బెయిల్‌పై వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్నారు.  

మరిన్ని వార్తలు