బిడ్డా.. నేనూ నీ వద్దకే

12 Jul, 2020 03:03 IST|Sakshi

ఆద్య తండ్రి కళ్యాణ్‌రావు బలవన్మరణం

కుమార్తె మరణం.. భార్య మోసం తట్టుకోలేక రైలుకింద పడి ఆత్మహత్య

రెండు ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

సాక్షి,యాదాద్రి: ‘నా బిడ్డలేని లోకంలో ఉండలేను. నేనూ నా కూతురు దగ్గరకే వెళ్తాను’ అంటూ కూతురు ఆద్య హత్యానంతరం తల్లడిల్లిన తండ్రి కళ్యాణ్‌.. శనివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాణంగా చూసు కునే కూతురి మరణం.. ప్రేమించి పెళ్లి చేసు కున్న భార్య చేసిన మోసం జీర్ణించుకోలేక  9 రోజులుగా మానసికంగా కుంగిపోయిన ఆయన తనువు చాలించిన వైనం అందరినీ కంటతడి పెట్టించింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకు ద్రోహం చేయ డమే కాక, ఇద్దరి మరణాలకు కారణమైందని, బయట తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకే కళ్యాణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ జరిగిన ఘోరం..
భువనగిరికి చెందిన సూరనేని కళ్యాణ్‌రావు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూషది ప్రేమ వివాహం. మిస్డ్‌కాల్‌ ద్వారా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో ఆద్య జన్మించింది. పంచాయతీ కార్యదర్శిగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మ కూర్‌ (ఎం) మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కళ్యాణ్‌రావు.. కుమార్తె చదువు కోసం రెండేళ్ల క్రితం ఘట్కేసర్‌ మండలం ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారి హోమ్‌కు మకాం మార్చారు.

ఈ క్రమంలో అనూష.. ఓ సెల్‌ఫోన్‌ షోరూమ్‌లో పరిచయమైన కరుణా కర్‌కు సన్నిహితమైంది. రోజూ ఆమె ఇంటికి వచ్చివెళ్లే క్రమంలో కరుణాకర్‌ తన మిత్రుడు రాజశేఖర్‌ను కూడా వెంట తీసుకెళ్లేవాడు. ఆమె రాజశేఖర్‌కు సన్నిహితంగా ఉంటున్నట్టు అను మానించిన కరుణాకర్‌ ఈ నెల 2న అనూష ఇంటికి వెళ్లాడు.దీంతో అనూష రాజశేఖర్‌తో కనిపించడంతో ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడే ఉన్న ఆద్య గొంతును సర్జికల్‌ బ్లేడుతో కోసి హతమార్చాడు. ఆపై తననూ గాయపర్చుకున్నాడు. కరుణాకర్, రాజశేఖర్‌పై పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపించారు.

కుమార్తె మృతితో తల్లడిల్లి..
ఆద్య మృతితో కళ్యాణ్‌ తల్లిడిల్లిపోయాడు. ఆద్య అంత్యక్రియలు భువనగిరిలో నిర్వహిం చారు. అప్పటి నుంచి భార్య అనూషతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. కుమార్తె అంతిమ సంస్కారం పూర్తయిన రోజు నుంచి కళ్యాణ్‌ అన్నం తినడం మానేసినట్లు తెలిసింది. తన జీవితం నాశనమైందని, కూతురు వద్దకు వెళ్తానని చెప్పి విలపించే వాడని బంధువులు చెప్పారు. మరోవైపు తనను పలకరించడానికి వచ్చిన వారికి భార్య గురించి చెçప్పుకోలేక కుమిలిపోయాడు. కాగా, శనివారం అనూష తన తల్లిగారి గ్రామమైన అనంతపురం జిల్లా గుత్తికి వెళ్తానని చెప్పడంతో ఉదయం భువనగిరి నుంచి సికింద్రాబాద్‌ తీసుకెళ్లాడు. 

జూబ్లీ బస్‌స్టేషన్‌లో గుత్తికి వెళ్లే బస్సు ఎక్కించాడు. అక్కడి నుంచి నేరుగా  మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తిరిగి భువనగిరి చేరుకున్న అతను రైల్వేస్టేషన్‌లో కొద్దిసేపు కూర్చున్నాడు. తర్వాత నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్లి  కిలోమీటర్‌ నంబర్‌ 239/10–12 వద్ద సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు తెలిపారు. పోలీసులు కళ్యాణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌.కాంతారావు తెలిపారు.

5 నిమిషాలలో వస్తానన్నాడు.. 
కళ్యాణ్‌ సికింద్రాబాద్‌ వెళ్లినప్పటి నుంచి సోదరుడు వెంకటేశ్‌ పలుమార్లు ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు. ‘బయటికి ఎక్కడికీ వెళ్లకు.. నేరుగా ఇంటికి రా’ అని చెప్పాడు. చివరిగా ఫోన్‌ చేసినప్పుడు ‘భువనగిరికి వచ్చాను. ఫ్రెండ్‌ దగ్గరికి వెళ్తున్నా.. ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తా’ అని చెప్పినట్లు వెంకటేశ్‌ ‘సాక్షి’కి తెలిపారు. కానీ అంతలోనే రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని విలపించాడు. 

అందరికీ ధైర్యం చెప్పేవాడు..
2003లో రామన్నపేటలో బిల్‌కలెక్టర్‌గా ఉద్యోగంలో చేరిన కళ్యాణ్‌రావు, ఆలేరు గ్రామ పంచాయతీలో పనిచేశారు. గ్రేడ్‌–3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతిపై ఆత్మకూర్‌ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. సీనియర్‌గా పంచాయతీ కార్యదర్శులకు అండగా ఉండేవాడని సన్నిహితులు చెప్పారు. విధి నిర్వహణలో జూనియర్లకు సలహా సూచనలిస్తూ సహకరించేవాడని, ఉన్నతాధికారులతో చర్చించి సహచర కార్యదర్శుల సమస్యలను పరిష్కారానికి కృషిచేసే వాడని తోటి ఉద్యోగులు గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విధి నిర్వహణలో సైతం కుమార్తె గురించే ఆలోచిస్తుండే వాడని స్నేహితులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు