నెత్తురోడిన నల్గొండ రహదారులు

29 Apr, 2018 08:43 IST|Sakshi
రమేష్‌ మృతదేహం, ప్రమాదానికి గురైన లారీ

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లోఐదుగురి దుర్మరణం

ఉమ్మడి నల్లగొండ జిల్లాపరిధిలో ఘటనలు

సాక్షి, మిర్యాలగూడ రూరల్‌ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనల వివరాలు.. మండల పరిధిలోని ఐలాపురం గ్రామానికి చెందిన బాణావత్‌ రూప్లా(37), దామరచర్ల మండలం కొండ్రపోలు శివారు మాన్‌తండాకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా అద్దంకి–నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కిష్టాపురం వద్ద నెల్లూరు నుంచి హైదరబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రూప్లా అక్కడికక్కడే మృతిచెందగా, ఐదు కిలోమీటర్ల వరకు బైక్‌ను ఇడ్చుకుపోయింది.

స్థానికుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సైదాబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలానికి వెళ్లి బస్సును స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శాంతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని..
యాదగిరిగుట్ట (ఆలేరు) : చౌటుప్పల్‌ మండలం వెలిమినేడుకు చెందిన రమేష్‌ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.వరంగల్‌ నుంచి భువనగిరి వైపు శనివారం వేకువజామున వెళ్తున్న క్రమంలో యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడా.. లేక మరో లారీ ఎదురుగా ఢీ కొట్టిందా తెలియలేదు. భువనగిరి వైపు వస్తున్న లారీలో ఉన్న రమేష్‌ అందులో ఇరుక్కుని మృతిచెంది ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని..
దేవరకొండ :  పట్టణానికి చెందిన శివకార్‌ ఈశ్వర్‌జి(50) తన భార్యతో కలిసి టీవీఎస్‌ మోటర్‌సైకిల్‌పై ఇంటి నుంచి మార్కండేస్వామి దేవాలయానికి వెళ్తున్న క్రమంలో భార్యను రోడ్డు పక్కన దింపాడు. అనంతరం స్థానిక భారత్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లోకి పెట్రోల్‌ పోయించుకునేందుకు వెళ్తుండగా కొండమల్లేపల్లి వైపు నుంచి దేవరకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈశ్వర్‌జి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనట్లు సీఐ  రామకృష్ణ తెలిపారు.

గేదె కళేబరాన్ని ఢీకొని వ్యక్తి..
మేళ్లచెరువు (హుజూర్‌నగర్‌) : చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర్లు (24) కొంతకాలంగా మేళ్లచెరువులో ఉంటూ స్థానిక మైహోం  సిమెంట్‌ పరిశ్రమలో రైల్వేట్రాక్‌ పాయింట్‌ మన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి తన దగ్గరి బంధువు అంబడిపూడి శ్రీనివాస్‌తో కలిసి కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురి పునరావాసకేంద్రంలో ఓ వివాహానికి హాజరై తిరిగి మేళ్లచెరువు వస్తుండగా కందిబండ సమీపంలోని రోడ్డుమీద పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. ఇదే సమయంలో లారీ వెంకటేశ్వర్లు తలపై నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మరో యువకుడికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి కొండలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ జయకర్‌ తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీకొని మరొకరు..
నాంపల్లి(మునుగోడు) : మండల పరిధిలోని దామెర గ్రామానికి అబ్బనబోయిన స్వామి (25), తన సోదరుడు అబ్బస్వామితో కలిసి శనివారం మండలంలోని లింగోటం గ్రామంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యాడు. అనంతరం తిరిగి స్వగ్రామం వస్తుండగా వడ్డెపల్లి శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న అబ్బస్వామికి స్వల్పగాయాలయ్యాయి.

కాగా, స్వామికి 45 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు