మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అరెస్ట్‌

14 Jun, 2020 05:33 IST|Sakshi

అనంతపురం క్రైం:  జేసీ బ్రదర్స్‌ దివాకర్‌ ట్రావెల్స్‌ ముసుగులో పాల్పడ్డ అక్రమాలకు సంబంధించి శనివారం తెల్లవారుజామున అనంతపురం పోలీసులు హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్ట్‌ చేశారు. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు రెండు బృందాలుగా వెళ్లి వారిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తీసుకొచ్చారు. 

► దివాకర్‌ రోడ్‌ లైన్స్‌కు చెందిన రెండు బస్సులకు నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు సమర్పించి, విక్రయించారని ఉప రవాణా శాఖాధికారి ఇటీవల వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు.  
► ఈ కేసులో ఏ1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్‌ రెడ్డి సతీమణి), ఏ2గా జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఏ3గా నాగేంద్ర, ఏ4గా బాబయ్య, ఏ5గా జేసీ విజయ (జేసీ దివాకర్‌ రెడ్డి సతీమణి), ఏ6గా జేసీ అస్మిత్‌ రెడ్డిలపై 420, 467, 468, 471, 472, 120బీ, 201, ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
► జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలకు అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. 
► ఏ3 నాగేంద్ర, ఏ4 బాబయ్య ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నారు. ఏ1 జేసీ ఉమారెడ్డి, ఏ5 జేసీ విజయలను అరెస్టు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా దివాకర్‌ ట్రావెల్స్‌పై అనంతపురం వన్‌టౌన్‌లో 8, తాడిపత్రిలో 16 కేసులు, నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి ఒక కేసు నమోదైంది. 
► అనంతపురం వన్‌టౌన్‌లో నమోదైన కేసుల్లో కొన్నింటికి ముందస్తు బెయిల్‌ లభించింది. ప్రస్తుతం ఒక కేసు విషయంలో వీరిని రిమాండ్‌కు తరలించారు. మరో కేసుపై నేడో రేపో పీటీ వారెంట్‌ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
► ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు రెడ్డిపల్లి సబ్‌ జైలుకు తరలించారు. అయితే అక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు ఉండటంతో తిరిగి అనంతపురం తీసుకువచ్చారు.     

మరిన్ని వార్తలు