స్నేహితుడే కాలయముడు

26 Jan, 2018 10:31 IST|Sakshi
వెంకటరమణ మృతదేహం (ఇన్‌సెట్‌) హత్యకు ఉపయోగించిన సుత్తి

ఏయూ క్వార్టర్స్‌లో విశ్రాంత రైల్వే ఉద్యోగి దారుణ హత్య

బంధువుతో కలిసి ఇంటిలోనే హతమార్చిన వర్సిటీ ఉద్యోగి

అనంతరం కాలువలో మృతదేహం పడేసిన నిందితులు

పెదవాల్తేరు/ఏయూ క్యాంపస్‌(విశాఖ తూర్పు): స్నేహితుడే కాలమయుడయ్యాడు. ఆ కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా చేశాడు. బ్యాంకు రుణం మంజూరులో సాయం చేస్తానంటూ నమ్మించి ఇంటికి తీసుకెళ్లి కడతేర్చాడు. ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌గేటు ఎదురుగా గల ఏయూ క్వార్టర్స్‌లో 19వ నంబరు నివాసం వద్ద జరిగిన హత్యోదంతం గురువారం ఉదయం కలకలం రేపింది. వర్సిటీ ఉద్యోగే హంతకుడు కావడంతో ఏయూ వర్గాలు విస్మయానికి గురయ్యాయి. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం దరి పాత ఐటీఐ శ్రీరాంనగర్‌కి చెందిన భద్రగిరి వెంకటరమణ (64) రైల్వేశాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇతనికి భార్య, కుమారుడు హేమంత్‌కుమార్, కుమార్తె లక్ష్మి ఉన్నారు. లక్ష్మి భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రులతోనే నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఏయూలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ వరప్రసాద్‌ (50) జిల్లా కోర్టు ఉద్యోగి ద్వారా వెంకటరమణకు ఏడేళ్ల క్రితం పరిచయమయ్యాడు.

వెంకటరమణ రామా టాకీస్‌ రోడ్డులో గల రెప్కో బ్యాంకులో గృహ రుణం నిమిత్తం రూ.20లక్షలకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. ఈ రుణం విషయంలో వెంకటరమణ స్నేహితుడు వరప్రసాద్‌ సహాయం తీసుకున్నారు. బ్యాంకు ష్యూరిటీ నిమిత్తం వరప్రసాద్‌ తన బంధువు జగదీష్‌తో కలిసి బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఐటీఐ వద్ద గల వెంకటరమణ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి వీరు ముగ్గురూ ఏటీఎం కేంద్రానికి వెళ్లి... వెంకటరమణ రూ.3వేలు డ్రా చేసి వరప్రసాద్‌కి ఇచ్చారు. అనంతరం ముగ్గురూ ఏయూ క్వార్టర్స్‌లోని వరప్రసాద్‌ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయానికి వెంకటరమణ ఏయూ క్వార్టర్స్‌లోని కాలువలో విగతజీవిగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీసీపీ ఫకీరప్ప, తూర్పు ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ ఇమ్మాన్యుయేల్‌రాజు తదితరులు సంఘటన స్థలానికి చేరకుని స్థానికులను విచారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.

కుమార్తెతో వివాహానికి ఒప్పుకోనందుకే...!
ఆంధ్రా యూనివర్సిటీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వరప్రసాద్‌ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా వరప్రసాద్‌తో కాపురం చేయలేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు వెంకటరమణ కుమార్తె లక్ష్మి భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో లక్ష్మితో తనకు వివాహం జరిపించాలని వరప్రసాద్‌ మూడు సంవత్సరాలుగా వెంకటరమణ కుటుంబ సభ్యులను కోరుతున్నాడు. కోర్టులో వరప్రసాద్‌ రెండో భార్య వేసిన విడాకుల కేసు తేలిన తర్వాత చూద్దామని లక్ష్మి కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో వెంకటరమణపై వరప్రసాద్‌ కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి తన ఇంట్లో లక్ష్మితో వివాహం విషయమై వెంకటరమణతో వరప్రసాద్‌ గొడవ పడ్డాడని తెలసింది. మాటామాటా పెరగడంతో తన బంధువు జగదీష్‌ సాయంతో వెంకటరమణపై వరప్రసాద్‌ దాడి చేశాడు. సిమెంట్‌ రేకులు, సుత్తితో మోది చంపేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకూడదని ఇళ్లంతా కడిగేశారు. ఇంటి వెనుక భాగం నుంచి మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మృతుని కుమారుడు హేమంత్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ ఇమ్మాన్యుయేల్‌రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉలిక్కిపడిన ఏయూ ఉద్యోగులు
నిత్యం విద్యార్థులతో ప్రశాంతంగా దర్శనమిచ్చే విశ్వవిద్యాలయం క్వార్టర్స్‌లో గురువారం ఉదయం మృతదేహం కనిపించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ నివాసాలకు కూతవేటు దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గతంలో విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. హత్యోదంతంతో పక్కనే నివాసం ఉంటున్న ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. రాత్రి 11 గంటల వరకు జనసంచారం ఉందని, అర్థరాత్రి సమయంలో సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కిరాతకంగా హత్య చేయడం, మృతదేహం అక్కడే వదిలేయడంతో ఆందోళన చెందారు. నిత్యం వరప్రసాద్‌ ఇంటిలో గొడవలు జరగడం, పెద్దగా అరుపులు వినపించడం పరిపాటేనని వీరు చెబుతున్నారు. బుధవారం రాత్రి సమయంలో సైతం ఇటువంటి వాగ్వాదం జరిగి, పెద్దగా మాట్లాడుకోవడం వినిపించినట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు