మరణంలోనూ వీడని స్నేహబంధం

30 Jun, 2018 12:20 IST|Sakshi
ఘటనాస్థలంలో మృతులు

పిడుగుపాటుకు ఇద్దరి మృతి

22 మేకలు మృత్యువాత

వర్షం వస్తోందని చెట్టు కిందకు చేరడంతో దుర్ఘటన

బాలాజీనగర్‌తండా(నకరికల్లు): శంకర్‌నాయక్, కోటయ్యలు ఇద్దరు గత ముప్పై ఏళ్లుగా ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఒక్కరోజు ఉండలేనంత స్నేహం వారిది. ఇద్దరు మేకలు కాసుకొని జీవనం సాగిస్తున్నారు. ఒకరికి ఏదైనా పని ఉంటే మేకలను మరొకరు కాసేవారు. వేర్వేరు గ్రామాలైనా ఇద్దరు నిత్యం కలసి కబుర్లు చెప్పుకోవాల్సిందే. వారిద్దరు చివరకు మరణంలోనూ కలిసి ఉండడంతో స్థానికులు వారి స్నేహం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారం కురిసిన పిడుగుల వానకు  ఇద్దరు మృత్యువాత పడగా, 22మేకలు మృతి చెందాయి. ఈ ఘటన నకరికల్లు మండలంలోని గుండ్లపల్లి పంచాయితీ పరిధిలో గల బాలాజీనగర్‌తండా సమీపంలోని క్వారీ వద్ద శుక్రవారం జరిగింది.   గుండ్లపల్లి గ్రామానికి చెందిన తేలుకుట్ల కోటయ్య(52), బాలాజీనగర్‌తండాకు చెందిన పాల్త్యా శంకర్‌నాయక్‌(50)లు  మేకలు కాసుకొని జీవనం సాగి స్తారు. యథావిధిగా మేకలను తోలుకొని తండా సమీపంలోని పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వర్షం కురుస్తుండడంతోఇద్దరు కలసి మేకలను తోలుకొని సమీపంలోని చెట్టు కిందకు చేరారు పెద్దశబ్దంతో చెట్టుమీద పిడుగుపడడంతో. వారిద్దరితో పాటు 22మేకలు కూడా అక్కడికక్కడే మృతి చెందాయి.

వర్షం తగ్గాక చాలాసేపటి తరువాత అటుగా వెళుతున్న ఓ రైతు మేకలను చూసి ఆగి చెట్టు వద్దకు వెళ్లాడు. చెట్టు కిందనే విగతజీవులుగా పడి ఉన్న ఇద్దరిని చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బంధువుల రోదనలతో ఆప్రాంతం మిన్నంటింది. నకరికల్లు ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును ఆరాతీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలి పారు. మృతుడు శంకర్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉండగా, మరో మృతుడు కోటయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

చెట్ల కింద ఉండకూడదు
వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండడం కాని, సెల్‌ఫోన్‌ మాట్లాడడం కాని చేయకూడదని తహసీల్దార్‌ ఎం.లీలాసంజీవకుమారి సూచించారు. పిడుగులు ఎక్కువ శాతం చెట్ల కిందే పడతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మరిన్ని వార్తలు